Liquor: మద్యం దుకాణాల లక్కీడ్రాకు సర్వం సిద్ధం

తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్‌ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Updated : 20 Aug 2023 19:41 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్‌శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు రికార్డు స్థాయిలో 1,31,964 దరఖాస్తుల వచ్చాయి. సోమవారం ఉదయం 10.30గంటల నుంచి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, దరఖాస్తు దారుల సమక్షంలోనే లక్కీడ్రా ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 34 ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఫంక్షన్‌ హాళ్లలో.. శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. దరఖాస్తు దారులు మాత్రమే లక్కీ డ్రా వద్దకు వచ్చే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

శంషాబాద్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ అబ్కారీ జిల్లాలకు .. లక్కీ డ్రా నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించారు. అధికంగా దరఖాస్తులు వచ్చిన చోట డ్రా కార్యక్రమం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగే అవకాశం ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. డ్రాలో లైసెన్స్‌ దక్కించుకున్న వ్యాపారి 24 గంటల్లో లైసెన్స్‌ ఫీజు మొత్తంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారం ఉంటుంది. 2021లో 68,691 దరఖాస్తులు రాగా తద్వారా రూ.1357 కోట్లు రాబడి వచ్చింది. ఈసారి ఏకంగా 1,31,964 దరఖాస్తులు రావడం ద్వారా రూ.2,639.28 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని