Sanjay Raut : అజిత్‌ పవార్‌ ఓ వడ్రంగి పిట్ట.. శిందే కుర్చీకి కన్నం పెట్టడం ఖాయం : సంజయ్‌ రౌత్‌

అజిత్‌ పవార్‌ (Ajit Pawar) మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) కుర్చీకి ఎసరు పెట్టడం ఖాయమని ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.

Published : 21 Aug 2023 01:31 IST

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అజిత్‌ పవార్‌ను (Ajit Pawar) శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) వడ్రంగి పిట్టతో పోల్చారు. శివసేన పత్రిక ‘సామ్నా’లో వ్యాసం రాసిన ఆయన.. అందులో పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. వడ్రంగి పిట్టలాగే అజిత్ పవార్‌ మహారాష్ట్ర సీఎం శిందే (Eknath Shinde) కుర్చీకి కన్నం పెడతారని జోస్యం చెప్పారు. అందుకు మరో డిప్యూటీ దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) సాయం చేస్తారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఆకలి లేని రోజులు తెచ్చుకున్నాం: సీఎం కేసీఆర్‌

సీఎం పదవి చేపట్టడం కోసం అజిత్ పవార్‌ ఓ వైపు వేచి చూస్తుంటే.. భాజపా ఎమ్మెల్యేలు సీఎం శిందేను తమ పార్టీకి భారంగా భావిస్తున్నారన్నారు. ‘అజిత్‌ పవార్‌ తాను సీఎం కావాలనుకుంటున్నారు. ఫడణవీస్‌కు మద్దతిస్తున్న భాజపా ఎమ్మెల్యేలంతా శిందేను పార్టీకి భారంగా చూస్తున్నారు. ఆయన వల్ల పార్టీకి నష్టమని అనుకుంటున్నారు. 2024 తరువాత మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని శిందే చెబుతున్న మాటల్లో నిజం లేదు. ఎందుకంటే అలాంటప్పుడు పవార్‌ను ప్రభుత్వంలోకి తీసుకునేవారే కాదని’ రౌత్‌ అంచనా వేశారు.

శరద్‌ పవార్‌ తన అబ్బాయ్‌ అజిత్‌లా తప్పటడుగులు వేసే వ్యక్తి కాదని రౌత్‌ పేర్కొన్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపాతో చేతులు కలపరని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను పైకి తీసుకొచ్చిన శరద్‌ పవార్‌నే అజిత్‌ పక్కనపెట్టాలని చూశారని రౌత్‌ విమర్శించారు. ‘అజిత్‌ సొంత పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన తప్పకుండా పెద్ద నాయకుడు అవుతారు. కానీ, ఏక్‌నాథ్‌ శిందేలా ఆయన కూడా భాజపా సాయం తీసుకొని ముందుకెళ్తే మాత్రం ఓ ఇసుక కోటలా కూలిపోవడం ఖాయం. రాజకీయాల్లో టవర్లే నిలబడతాయి. ఇసుక కోటలు కాదని’ రౌత్‌ విశ్లేషించారు. 

ఇక ప్రధాని నరేంద్రమోదీకి మద్దతిస్తే అది తిరోగమన శక్తులను ప్రోత్సహించినట్లుగా శరద్‌ పవార్‌ భావిస్తారని రౌత్‌ వ్యాఖ్యానించారు. పవార్‌ను వీడి వెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. భాజపాతో కలిసి పవార్‌ పొరపాటు చేయరని అభిప్రాయపడ్డారు. ఇది వ్యక్తులకు సంబంధించిన సమస్య కాదని.. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య తేడా అని రౌత్‌ పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని