Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 11 Apr 2024 21:00 IST

1. ఉగ్రవాదులు పారిపోయినా.. వెంటాడి మరీ మట్టుబెడతాం: మోదీ

భారత్‌కు హాని తలపెట్టేందుకు యత్నిస్తున్న ఉగ్రవాదులను వదలబోమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. ఉరి, బాలాకోట్‌ దాడులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని రిషికేశ్‌లో భాజపా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో కేంద్రంలోని తమ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను మరోసారి గుర్తుచేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.  రంజాన్‌ నెలలోనూ బిర్యానీనే టాప్‌.. హైదరాబాద్‌లోనే ఆర్డర్లు అధికం

మన దేశంలో బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వారాంతాలు, పండగ రోజులు, ఐపీఎల్‌ సీజన్‌.. ఇలా సందర్భం ఏదైనా ఎక్కువమంది ఆసక్తి చూపే వంటకంలో బిర్యానీనే అగ్రస్థానంలో ఉంటుంది. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్‌ నెలలోనూ ఈ వంటకం మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఒక్క నెలలోనే 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. సాధారణ నెలలతో పోలిస్తే ఈ సంఖ్య 15 శాతం అధికమని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.  కోనసీమను కలహాల సీమగా మార్చేందుకు జగన్‌ ప్రయత్నించారు: పవన్‌

అందమైన కోనసీమను కలహాల సీమ చేయాలని జగన్‌ చూస్తే.. తాము ప్రేమ సీమగా మార్చేందుకు  ప్రయత్నించామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తెలిపారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకే ఎన్డీయే కూటమి ఏర్పడిందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. వాట్సప్‌లో ఈ ఐకాన్‌ మీకూ కనిపించిందా? ఆ కొత్త ఫీచర్‌ ఇదే..!

 ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమైంది. ఇప్పటివరకు చాట్స్‌, ఆడియో/వీడియో కాల్స్‌కు పరిమితమైన ఈ యాప్‌.. ఇప్పుడు ఏఐ ఫీచర్లకు రెడీ అయ్యింది. ఇందులోభాగంగా మెటా ఏఐను వాట్సప్‌నకు జోడించనుంది. ఇందులో చాట్‌ మెనూలో వివిధ రంగులతో కూడిన వృత్తాకారంలో ఉన్న ఐకాన్‌ కనిపించింది. భారత్‌లో కొందరు యూజర్లకు ఈ ఫీచర్‌ దర్శనమిచ్చింది. కాసేపటి తర్వాత అదృశ్యమైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికా పరిశోధక రాకెట్లు.. మిషన్‌ సారథి భారత సంతతి వ్యక్తే

ఇటీవల సూర్యగ్రహణం (Solar Eclipse) సందర్భంగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా (NASA)’ మూడు పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. సూర్యగ్రహణం వేళ భూగ్రహంపై సూర్యకాంతి మసకబారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితమవుతుందో అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. ఈ మిషన్‌కు సారథ్యం వహించింది భారత సంతతి వ్యక్తే కావడం విశేషం. ఆయనే ఆరోహ్‌ బడ్జాత్యా (Aroh Barjatya). నాసా ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఎన్నికలు లాంఛనమే.. కూటమిదే విజయం: చంద్రబాబు

ఎన్నికలు లాంఛనమే.. కూటమే  గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇది చాలా కీలక సమయం.. ఐదేళ్ల  నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే సమయం వచ్చిందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. స్కాన్‌ చేయండి.. స్కామ్‌లు చూడండి’: భాజపాపై పోస్టర్ల కలకలం

సార్వత్రిక ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలు ఉద్ధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక మొదటి దశ ఓటింగ్ సమీపిస్తుండగా.. ఆ వేడి మరింత పెరిగింది. ఈ సమయంలో తమిళనాడు (Tamil Nadu)లో కొన్ని పోస్టర్లు (posters) కలకలం సృష్టిస్తున్నాయి. కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఇవి వెలిశాయి. ఆ పోస్టర్ల పైభాగంలో ‘జై పే’ అని రాసిఉంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. లోక్‌సభ బరిలో.. ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు

 మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) హంతకుడి కుమారుడొకరు లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌ (Punjab)లోని ఫరీద్‌కోట్‌ స్థానం నుంచి 45 ఏళ్ల సరబ్‌జీత్‌ సింగ్‌ ఖల్సా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్‌ సింగ్‌ కుమారుడే సరబ్‌జీత్‌. గతంలో ఈయన పలు ఎన్నికల్లో పోటీ చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఆ దేశాల్లో ‘కోరింత దగ్గు’ కలవరం.. ఫిలిప్పీన్స్‌లో 54 మరణాలు

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోరింత దగ్గు (Whooping Cough) కలవరపెడుతోంది. చైనా, ఫిలిప్పీన్స్‌, చెక్‌ రిపబ్లిక్‌తోపాటు నెదర్లాండ్స్‌లో అనేక మరణాలు నమోదవుతున్నాయి. కేవలం ఫిలిప్పీన్స్‌లోనే మూడు నెలల్లో 54 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. టాటూ పార్లర్‌ల ఎదుట పోలీసుల క్యూ.. ఎందుకంటే?

పచ్చబొట్లు వేయించుకున్న పోలీసులు వెంటనే వాటిని తొలగించుకోవాలని ఒడిశా (Odisha) స్పెషల్‌ సెక్యూరిటీ బెటాలియన్‌ (SSB) ఆదేశించింది. అందుకు తక్కువ గడువు పెట్టడంతో టాటూ పార్లర్‌ల వద్ద పోలీసులు క్యూ కట్టారు. ఉన్నఫళంగా పచ్చబొట్లను తొలగించాలని ఆదేశించడానికి గల కారణాలను డీఎస్పీ సుధాకర్‌ మిశ్రా వివరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని