Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 09 Jul 2023 16:58 IST

1. శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి (Srikalahasthi)కి ఏడుగురు ఎర్టిగా వాహనంలో బయల్దేరి వెళ్తుండగా, ఓ లారీ అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మృతులంతా ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అమర్‌నాథ్‌ యాత్ర పునః ప్రారంభం

ప్రతికూల వాతావరణం కారణంగా మూడురోజులుగా నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath yatra) ఆదివారం పునఃప్రారంభమైంది. జమ్మూ-కశ్మీర్‌లోని పంజ్‌తర్ణి, శేష్‌నాగ్‌ క్యాంపుల నుంచి యాత్రికులు బయల్దేరారు. అమర్‌నాథ్‌ ఆలయం వద్ద వాతావరణం సానుకూలంగా మారిన వెంటనే అధికారులు గేట్లను తెరిచి భక్తులు హిమలింగానికి పూజలు చేసేందుకు అనుమతించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉజ్జయిని మహాకాళికి బోనం సమర్పించిన కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయ సిబ్బంది కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మహాకాళిని దర్శించుకొని బంగారు బోనం సమర్పించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘నా దగ్గర KTM 390 బైక్‌ ఉంది.. కానీ, బయటకు తీయను’

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇటీవల దేశ రాజధాని వీధుల్లో పర్యటించిన విషయం తెలిసిందే. దిల్లీలోని కరోల్‌బాగ్‌లోని బైక్‌ మెకానిక్‌ (Bike Mechanic) షాపులను సందర్శించిన ఆయన.. అక్కడి వర్కర్లతో ముచ్చటించారు. అంతేకాకుండా వారితో కలిసి కొన్ని బైక్‌లను రిపేర్‌ (Bike Repair) చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న బైక్‌ గురించీ ప్రస్తావించిన రాహుల్‌.. దాన్ని ఎందుకు బయటకు తీయరో వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తొందర పడొద్దు.. మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు ఈటల సూచన

మాజీ మంత్రి, భాజపా నేత ఎ.చంద్రశేఖర్‌తో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. చంద్రశేఖర్  పార్టీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన ఈటల.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. భాజపాలో ఎదురైన ఇబ్బందులను ఈటలకు చంద్రశేఖర్ వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సొంతపార్టీ నేతలే మా భూములు ఆక్రమించారు: వైకాపా నాయకుడి ఆవేదన

వైకాపా నేతలు తమ సొంత పార్టీ నేతల ఆస్తులను కూడా వదలం లేదు. కడప జిల్లా సీకే దిన్నె మండలం రామరాజుపల్లిలోని తమ ప్లాట్లను సొంతపార్టీ నేతలే ఆక్రమించారని వల్లూరు మండలం పెద్దపుత్త గృహసారథి ఈశ్వర్‌రెడ్డి ఆరోపించారు. డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా అండతో సుబాన్‌ బాషా అనే వ్యక్తి ఆక్రమించినట్లు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎమ్మెల్యే అనిల్‌వి దొంగ ప్రమాణాలు: ఆనం వెంకటరమణారెడ్డి

ఎమ్మెల్యే అనిల్ తన ఆస్తులపై పచ్చి అబద్ధాలతో దేవుని ఎదుట ప్రమాణం చేశారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ‘‘ ఆస్తి పత్రాల్లో ఉన్న చిరంజీవి ఎవరు? మీ పీఏ నాగరాజు సాక్షి సంతకం ఎందుకు పెట్టారు?కూల్ డ్రింక్ షాపు యజమాని పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు ఉన్నాయి.’’ అని ఆనం ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హత్య చేసి.. కరెంట్‌ షాక్‌గా చిత్రీకరణ

తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హతమార్చాడో యజమాని. అనంతరం దాన్ని కరెంట్‌ షాక్‌గా చిత్రీకరిండాడు.  ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...స్థానికంగా నివాసం ఉండే గజానన్‌ ఓ కిరణా షాపులో పని చేస్తున్నాడు.  శనివారం ఉదయం యజమానికి, అతడికి చిన్న వివాదం జరిగింది.  దీంతో కోపోద్రిక్తుడైన ఆ యజమాని అతడికి నిప్పు అంటించి హతమార్చాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దిల్లీ ఐఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య!

దేశవ్యాప్తంగా ఐఐటీ (IIT)ల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలకలం రేకెత్తిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐఐటీ మద్రాస్‌ (IIT Madras)లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా ఐఐటీ దిల్లీ (IIT Delhi)లో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బరేలీ (Bareilly)కి చెందిన ఆయుష్‌ అనే విద్యార్థి ఐఐటీ దిల్లీలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నేనేమీ సంతోషంగా లేను: భారత ఫుట్‌బాల్‌ కోచ్‌

వరుసగా ఇంటర్‌కాంటినెంటల్‌ కప్, శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ను (Saff) భారత్ కైవసం చేసుకుని అదరగొట్టేసింది. జట్టును నడిపించడంలో కెప్టెన్ సునీల్ ఛెత్రీ కష్టంతోపాటు కోచ్‌ ఇగార్‌ స్టిమాక్‌ మార్గనిర్దేశకం చాలా కీలకంగా మారింది. ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో సఫలీకృతులయ్యారు. అయితే, కోచ్‌ స్టిమాక్‌ మాత్రం ఇప్పటికీ సంతోషంగా లేనట్లు తెలుస్తోంది. జట్టు మెరుగయ్యే విధానం సరిగా లేదనే అభిప్రాయాన్ని స్టిమాక్‌ వెల్లడించాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని