Amarnath yatra: పంజ్‌తరణి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం..!

పంజ్‌తర్ణిలో అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభమైంది. దీంతో అక్కడ చిక్కుకొన్న వందల మంది భక్తులు తిరిగి యాత్రను  మొదలుపెట్టనున్నారు. 

Updated : 09 Jul 2023 14:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతికూల వాతావరణం కారణంగా మూడురోజులుగా నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర(Amarnath yatra) ఆదివారం పునఃప్రారంభమైంది. జమ్మూ-కశ్మీర్‌లోని పంజ్‌తర్ణి, శేష్‌నాగ్‌ క్యాంపుల నుంచి యాత్రికులు బయల్దేరారు. పంజ్‌తర్ణిలో దాదాపు 1500 మంది చిక్కుకుపోగా.. వీరిలో దాదాపు 200 మంది తెలుగువారు ఉన్నారు. అమర్‌నాథ్‌ ఆలయం వద్ద వాతావరణం సానుకూలంగా మారిన వెంటనే అధికారులు గేట్లను తెరిచి భక్తులు హిమలింగానికి పూజలు చేసేందుకు అనుమతించారు. 

ఇప్పటికే దర్శనం చేసుకొన్న భక్తులను బల్తాల్‌ బేస్‌ క్యాంపునకు చేరుకొనేందుకు అనుమతిస్తామని అధికారులు పీటీఐ వార్తసంస్థకు వెల్లడించారు. మరోవైపు అనంతనాగ్‌లో సైన్యం తమ క్వాజిగుండ బేస్‌క్యాంప్‌లో 700 మంది యాత్రికులకు ఆశ్రయం కల్పించింది. భారీ వర్షాల కారణంగా వారి యాత్ర నిలిచిపోయింది.   

మరోవైపు జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారి మూతపడింది. దీంతో జమ్మూ నుంచి కొత్తగా యాత్రికులను మాత్రం ముందుకు అనుమతించడంలేదు. ఈ జాతీయ రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగి పడటంతో పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రామ్‌బన్‌ జిల్లాలో దాదాపు 40 అడుగుల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో 3,500 వాహనాలు చిక్కుకుపోయాయి. 

గురువారం రాత్రి నుంచి జమ్మూ-కశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అమర్‌నాథ్‌ క్షేత్రం వద్ద భారీగా హిమపాతం పడుతోంది. దీంతో దాదాపు దాదాపు 50 వేల మంది యాత్రికులు తమతమ బేస్‌ క్యాంపుల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు