Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 01 Apr 2024 16:58 IST

1. జైల్లో ఆ మూడు పుస్తకాలు కావాలి: కోర్టును కోరిన కేజ్రీవాల్‌

మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు రౌజ్‌ అవెన్యూకోర్టు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తిహాడ్‌ జైలుకు తరలించనున్నారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు కొన్ని అభ్యర్థనలు చేశారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది అప్లికేషన్ సమర్పించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 10 ఏళ్లలో ఆర్‌బీఐ చర్యలు భేష్‌.. ప్రధాని మోదీ ప్రశంస

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై (RBI) ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు. గడిచిన 10 ఏళ్ల బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడంలో ఆర్‌బీఐ కీలక భూమిక పోషించిందని కొనియాడారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఏర్పాటై 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 36 కోట్ల పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు.. స్వస్తి పలకడం సాధ్యమే!

భారత్‌ను ‘గ్రీన్‌ ఎకానమీ’ (Green Economy)గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా హైబ్రిడ్‌ వాహనాలపై జీఎస్టీ (GST) తగ్గించడంతోపాటు 36 కోట్ల పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నుంచి దేశానికి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా?: భట్టి

సూర్యాపేటలో భారాస అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. భారాస నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతుంటే ఆయన తట్టుకోలేపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా?అని ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కొత్త ఏడాదిలో లాభాలు జోరు.. 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని లాభాలతో ఆరంభించాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను తాకిన సూచీలు.. కాస్త క్షీణించి ఓ మోస్తరు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల మూలంగా సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 74 వేలు, నిఫ్టీ 22,450 ఎగువన ముగిశాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి రాధాకిషన్‌ రావు రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీగా ఉన్న ఆయన్ని కేసులో ఏ4గా చేర్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్‌ యజమాని ఆనంద్‌ ప్రసాద్‌ నుంచి రూ.70 లక్షలు సీజ్‌ చేసినట్లు రాధాకిషన్‌రావు వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4కు వాయిదా పడింది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా ఈ నెల 16 వరకు బెయిల్‌ మంజూరు చేయాలని మార్చి 26న ఆమె రౌస్‌ అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కవిత పిటిషన్‌పై సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సీఎం జగన్‌ పింఛనర్ల పొట్టకొట్టారు: చంద్రబాబు

రాజకీయ స్వార్థం కోసం సీఎం జగన్‌ పింఛనర్ల పొట్టకొట్టారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని పునరుద్ఘాటించారు. తెదేపా నేతలు, బూత్‌ లెవల్‌ కార్యకర్తలతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ రెండు నెలలు ఎవరికైనా పింఛన్‌ అందకపోతే.. అది కూడా కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఏక్‌నాథ్‌ శిందేలు కాంగ్రెస్‌లోనే ఉన్నారు: కేటీఆర్‌

కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ భారాస విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రజలను జగన్‌ ఫూల్‌ చేశారు.. వీడియో విడుదల చేసిన లోకేశ్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాయ, మోసం ప్రజలకు తెలియాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara lokesh) అన్నారు. అధికారం కోసం జగన్‌ చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ఇవిగో అంటూ ఎక్స్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈసారి ప్రజల చేతిలో జగన్‌కి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని