Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 Apr 2024 16:59 IST

1. పసుపు బోర్డు ఏర్పాటులో నిజామాబాద్‌ పేరెక్కడ?: సీఎం రేవంత్‌రెడ్డి

సెప్టెంబర్‌ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్‌ పేరు లేదన్నారు. నిజామాబాద్‌లోనే బోర్డు ఏర్పాటు అని స్పష్టంగా చెప్పకుండా నోట్‌ విడుదల చేశారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ ఎన్నికలు.. మరో 38 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌

ఏపీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. గతంలో 114 స్థానాలకు వెల్లడించగా.. తాజాగా 38 నియోజకవర్గాలకు ఖరారు చేశారు. ఇప్పటికే ప్రకటించిన 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు 142 స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దు: సీబీఐ

దిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు కవిత అర్హురాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలరని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్‌ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారని చెప్పారు. ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు

తీవ్ర ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎన్నికలకు ముందే భాజపాకు తొలి విజయం.. ఆ ఎంపీ ఎన్నిక ఏకగ్రీవం..!

సార్వత్రిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాతా తెరించింది. గుజరాత్‌లోని సూరత్‌ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవడం, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో దలాల్‌ విజయానికి మార్గం సుగమమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 8 ఏళ్ల జీతం 4 వారాల్లో తిరిగివ్వాలా?.. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తాం: మమత

పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఉద్యోగాలను రద్దు చేయడంతో పాటు..  వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏఐకి డేటా కంటే విలువైనది ఇదే.. మార్క్‌ జుకర్‌బర్గ్‌ అంచనా!

ప్రముఖ టెక్ సంస్థ మెటా ఇటీవల లామా-3 ఏఐ మోడల్స్‌ను విడుదల చేసింది. వాటిని వాట్సప్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానం చేసింది. ఈసందర్భంగా భవిష్యత్తులో కృత్రిమ మేధ (AI) పనితీరును నిర్దేశించబోయే అంశమేంటో సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. అది డేటా మాత్రం కాదని స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయా..?

ప్రతి ఐపీఎల్‌ సీజన్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చడం బెంగళూరుకు అలవాటుగా మారింది. ఈ సారైతే.. జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట్లో ఏడు మ్యాచ్‌లు ఓడింది. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగే తొలి జట్టుగా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక టాప్‌-4లో బెంగళూరు నిలవాలంటే అద్భుతాలే జరగాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘పచ్చని’ పోలింగ్‌ బూత్‌.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!

దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఎండ నుంచి పోలింగ్‌ బూత్‌కి వచ్చిన ఓటర్లకు ఉపశమనం కల్పించేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన అందరినీ ఆకర్షిస్తోంది. తిరుపత్తూరు జిల్లాలోని పోలింగ్‌ బూత్‌ ఎదుట కొబ్బరి, వెదురు, అరటి ఆకులతో పందిరి వేసి అందంగా ముస్తాబు చేశారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి 

10. చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్‌తో దౌత్యం జరిపేనా!

మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (PNC) భారీ మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను 70 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని