icon icon icon
icon icon icon

Lok Sabha elections: ఎన్నికలకు ముందే భాజపాకు తొలి విజయం.. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం..!

Lok Sabha elections: సూరత్‌లో భాజపా అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు తొలి విజయం లభించినట్లయ్యింది.

Updated : 22 Apr 2024 17:09 IST

అహ్మదాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) అధికార భారతీయ జనతా (BJP) పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. గుజరాత్‌ (Gujarat)లోని సూరత్‌ (Surat) స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవడం, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో దలాల్‌ విజయానికి మార్గం సుగమమైంది.

సూరత్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న నీలేశ్‌ కుంభనీ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి ఆదివారం తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌వో వెల్లడించారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ నుంచి వేసిన మరో నామినేషన్‌ కూడా చెల్లనిదిగా ప్రకటించారు. మరోవైపు, ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన సోమవారం వీరంతా పోటీ నుంచి వైదొలిగారు. వీరిలో స్వతంత్రులతో పాటు బీఎస్పీ అభ్యర్థి కూడా ఉండటం గమనార్హం.

ఇక, పోటీలో ముకేశ్‌ దలాల్‌ ఒక్కరే మిగలడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆయన విజయంపై ఈసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని గుజరాత్‌ భాజపా అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ దలాల్‌కు అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి సూరత్‌ తొలి కమలాన్ని అందించింది’’ అని రాసుకొచ్చారు. అటు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ కూడా దీనిపై పోస్ట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో భాజపా చారిత్రక విజయానికి నాంది పడిందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగా 400 స్థానాలతో కమలం జయభేరి మోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సూరత్‌లో ముకేశ్‌ దలాల్‌ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే.. ఈ స్థానానికి పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img