Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Apr 2024 17:09 IST

1. అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసు.. పలువురు కాంగ్రెస్‌ నాయకులకు సమన్లు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు, సోషల్‌ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చి.. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్‌, పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీశ్‌, ఆ పార్టీకి చెందిన నవీన్‌, శివకుమార్‌లకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకివ్వరు?: చంద్రబాబు

వైకాపా కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని.. మండుటెండల్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారాస హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతే: జేపీ నడ్డా

దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ.. భాజపాయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసింది. తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగింది. కానీ, భారాస ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలింది’’ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్‌ అనిల్‌

దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్‌ అనిల్‌ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేమన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా తిరుపతి- శ్రీకాకుళం, కాచిగూడ- కాకినాడ, హైదరాబాద్‌- నరసాపురం మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా ఓ వీధి వ్యాపారితో ముచ్చటించారు. కర్ణాటకలోని సిరసి పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడ స్థానికంగా పండ్లు విక్రయించుకునే మోహిని గౌడ అనే మహిళతో మాట్లాడారు. స్వచ్ఛభారత్‌ కోసం ఆమె చేస్తున్న పనిని కొనియాడారు. ఎవరీ మెహిని గౌడ..

7. ఈ క్రెడిట్‌ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!

విద్యుత్తు, ఫోన్‌, గ్యాస్‌, ఇంటి అద్దె వంటి యుటిలిటీ బిల్లులు క్రెడిట్‌ కార్డుతో చెల్లిస్తే ఒకప్పుడు సంస్థలు రివార్డులు ఇచ్చేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది. అద్దెపై ఇప్పటికే సేవా రుసుము వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతర బిల్లులకూ దీన్ని వర్తింపజేసేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఛేజింగ్‌కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?

సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. గత రెండేళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ఈ జట్టుపై పెద్దగా అంచనాల్లేవు. కానీ, అనూహ్యంగా ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు రికార్డు రెండుసార్లు బద్ధలు కొట్టింది. పాయింట్ల పట్టికలో టాప్‌ - 4లో కొనసాగుతోంది. అయితే, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో తమ జట్టు ఛేజింగ్‌కి వస్తే హైదరా‘బాధ’ తప్పదా అని ఫ్యాన్స్‌ నిట్టూరుస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?

సందేశ్‌ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని ప్రశ్నించింది. సందేశ్‌ఖాలీ అంశంలో సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి

ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ డ్యామ్ కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో 40 మంది వరకు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిఫ్ట్‌ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌లో నీటి ఉద్ధృతి పెరిగి గోడలు కొట్టుకుపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని