icon icon icon
icon icon icon

JP Nadda: భారాస హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతే: జేపీ నడ్డా

దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భాజపాయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 

Published : 29 Apr 2024 15:33 IST

కొత్తగూడెం: దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ.. భాజపాయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని తిరిగి మళ్లీ ఏర్పాటు చేస్తామని, ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్‌, వినోద్‌రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

‘‘అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను మోదీ సాకారం చేశారు. మా ప్రభుత్వం ఎంతో ధైర్యంగా ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. ఎస్టీల అభివృద్ధి కోసం ఎంతో చేసింది. ఇప్పటికే గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మా పాలనలో 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ ఇస్తున్నాం. మరో ఐదేళ్లు కొనసాగిస్తాం. 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చాం. మరో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తాం. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికీ చికిత్స లభిస్తుంది. భవిష్యత్తులో పైపులైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేస్తాం. మోదీ ఎప్పుడూ పేదలు, రైతులు, మహిళల గురించే ఆలోచిస్తారు. 

భారాస ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలింది

కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసింది. తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగింది. కానీ, భారాస ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ పాలన కూడా చూస్తున్నాం. ఇండియా కూటమిని ఆయా పార్టీల వారసుల కోసమే ఏర్పాటు చేశారు. కూటమిలోని నేతలంతా కుంభకోణాలకు పాల్పడ్డారు. కేసీఆర్‌ కుమార్తె కవిత దిల్లీ మద్యం కేసు కుంభకోణంలో జైలులో ఉన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతే. వారి ప్రభుత్వంలో సంఘవ్యతిరేక శక్తులన్నీ విజృంభిస్తాయి’’అని నడ్డా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img