Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Aug 2023 09:10 IST

1. ఏడాదిలో రెండుసార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు

నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కేంద్రం పలు కీలక మార్పులకు సిద్ధమైంది. టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో ఉత్తమ స్కోరు ఎంచుకునే అవకాశం ఉంటుంది. పరీక్షలు సెమిస్టర్‌ పద్ధతిలో పెడతారా, లేక మొత్తం సిలబస్‌పై రెండు సార్లు నిర్వహిస్తారా అనే విషయంపైనా; ఎప్పటి నుంచి అమలు చేస్తారనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చంద్రుడి వనరులపై హక్కులు ఎవరివి?

చందమామపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగి, వరుసగా వ్యోమనౌకలను పంపుతున్న నేపథ్యంలో.. ఆ ఖగోళ వస్తువు, అక్కడి వనరులపై హక్కులు ఎవరివి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి 1966లో ఐరాస.. ఔటర్‌ స్పేస్‌ ట్రీటీని తీసుకొచ్చింది. దీని ప్రకారం చందమామ, ఇతర ఖగోళ వస్తువులపై ఏ దేశమూ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు. అన్ని దేశాల ప్రయోజనం కోసం ఖగోళ అన్వేషణ జరగాలి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విజయవాడలో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున నగరంలోని కేపీనగర్‌ ప్రాంతంలో ఉన్న టీవీఎస్‌ వాహనాల షోరూంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. షోరూమ్‌తో పాటు గోదాములో ఉన్న సుమారు 300 వరకు ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. విజయవాడలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూం ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బత్తిని హరినాథ్‌ గౌడ్‌ కన్నుమూత

ఆస్తమా బాధితులకు హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్‌ గౌడ్‌ (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఏటా మృగశిర కార్తెను పురస్కరించుకొని బత్తిని కుటుంబీకులు పెద్ద ఎత్తున చేప ప్రసాదం పంపిణీ చేపడుతున్న విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆర్టీసీ ఉద్యోగులకు ఏ పింఛనిస్తారో?

‘ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పాత పింఛను పథకాన్ని (ఓపీఎస్‌) మాకు కూడా అమలు చేస్తారనే ఆశతో ప్రభుత్వంలో విలీనానికి అంతా సమ్మతించాం. ఇప్పటి వరకు ఏ పింఛను ఇస్తారనేది కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఏం చేస్తారో కూడా తెలీదు’ ఇది ప్రతి ఆర్టీసీ (ప్రజా రవాణా శాఖ-పీటీడీ) ఉద్యోగి మనోగతం. ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో 2020 జనవరి 1న విలీనం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. డిగ్రీ సింగిల్‌ మేజర్‌ కిచిడీ.. సిలబస్‌?

డిగ్రీ సింగిల్‌ మేజర్‌లో మొదటి సెమిస్టర్‌కు తీసుకొచ్చిన సిలబస్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు ఒక సబ్జెక్టులో నిపుణత సాధించేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్న ఉన్నత విద్యామండలి మొదటి సెమిస్టర్‌లో మూడు సబ్జెక్టుల విధానాన్ని తీసుకొచ్చింది. ఇది కిచిడీ సిలబస్‌గా మారిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. మొదటి సమిస్టర్‌లో ఏడు పేపర్లు పెట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఢీ’హెచ్‌ఎంసీ

నగరాన్ని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలన్న నినాదాలతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం మార్మోగింది. కొన్ని రోజులుగా కార్మికులు ఈ విషయమై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిరసనలు తెలుపుతుండగా.. బుధవారం జరిగిన 7వ సర్వసభ్య సమావేశం సందర్భంగా అన్ని పార్టీలు వారికి మద్దతు ప్రకటించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చంద్రయాన్‌ - 3 కామెంట్రీ.. ఆమెదే!

అంతరిక్ష ప్రయోగాల్లో.. రాకెట్‌ డిజైనింగ్‌, ఇతర హార్డ్‌వేర్‌ పనులే కాదు.. దాన్ని నింగిలోకి పంపించాక.. అది నిర్దేశిత కక్ష్యలోనే తిరుగుతోందా? ఒక దశ తర్వాత మరో దశ పూర్తి చేస్తోందా? అన్న విషయాలు చూస్తే మనకు అర్థం కావు. అందుకే ఆయా విషయాల గురించి విశ్లేషించి చెప్పే బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు పి. మాధురి. రాకెట్‌ లాంచ్‌ కామెంటేటర్‌గా గుర్తింపు పొందిన ఆమె.. ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన ఎన్నో రాకెట్లకు కామెంటేటర్‌గా వ్యవహరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మౌనం వీడని తుమ్మల

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి మాంత్రికుడిగా పేరొందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు భారాస నుంచి పాలేరు టికెట్‌ దక్కకపోవడంపై ఆయన అభిమానులు, ఆపార్టీలోని ఓ వర్గం నాయకులు రగిలిపోతున్నారు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొత్త నాయకులు గులాబీ గూటికి చేరినా ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీపై నోరెత్తకుండా క్రమశిక్షణతో మెలిగిన నేతకు టికెట్‌ నిరాకరించారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బ్రిక్స్‌ విస్తరణకు సై

బ్రిక్స్‌ విస్తరణకు భారత్‌ మద్దతు పలికింది. ఏకాభిప్రాయం ఆధారంగా కూటమిని విస్తరించేందుకు సిద్ధమేనని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. భాగస్వామ్య దేశాల పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడాన్ని స్వాగతిస్తామని వెల్లడించారు. దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ దేశాధినేతల ప్లీనరీలో ప్రధాని ప్రసంగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని