brics: బ్రిక్స్‌ విస్తరణకు సై

బ్రిక్స్‌ విస్తరణకు భారత్‌ మద్దతు పలికింది. ఏకాభిప్రాయం ఆధారంగా కూటమిని విస్తరించేందుకు సిద్ధమేనని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు.

Updated : 24 Aug 2023 05:42 IST

ఏకాభిప్రాయంతో సభ్యత్వం ఇద్దామన్న మోదీ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మద్దతు
ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ-20లో సభ్యత్వానికి మోదీ ప్రతిపాదన

జొహన్నెస్‌బర్గ్‌: బ్రిక్స్‌ విస్తరణకు భారత్‌ మద్దతు పలికింది. ఏకాభిప్రాయం ఆధారంగా కూటమిని విస్తరించేందుకు సిద్ధమేనని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. భాగస్వామ్య దేశాల పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడాన్ని స్వాగతిస్తామని వెల్లడించారు. దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ దేశాధినేతల ప్లీనరీలో ప్రధాని ప్రసంగించారు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో బ్రెజిల్‌, చైనా, దక్షిణాఫ్రికా అధ్యక్షులు లూలా డ సిల్వా, జిన్‌పింగ్‌, రమఫోసాతోపాటు రష్యా విదేశాంగ మంత్రి పాల్గొన్నారు. ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ-20లో శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలన్న తమ ప్రతిపాదనకు బ్రిక్స్‌ భాగస్వామ్య పక్షాలు మద్దతు పలుకుతాయని ఆశిస్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. దక్షిణార్థ గోళంలోని దేశాలకు బ్రిక్స్‌ ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. త్వరలో భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సులోనూ ఈ దేశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

  • ప్రధాని ప్రసంగంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా స్పందించారు. మహాత్మా గాంధీ తమ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. చంద్రయాన్‌-3 విజయంపై అభినందనలు తెలిపారు. మరిన్ని చీతాలను అందజేస్తామని ప్రకటించారు.
  •  మోదీ తర్వాత మాట్లాడిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌... బ్రిక్స్‌ విస్తరణకు మద్దతు పలికారు. సాధ్యమైనంత త్వరగా విస్తరిద్దామని పిలుపునిచ్చారు.

జాతీయ పతాకానికి గౌరవం

బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా గ్రూప్‌ ఫొటో దిగేందుకు వచ్చిన మోదీకి వేదికపై జాతీయ పతాక రంగులతో ఉన్న ఓ కాగితం కనిపించింది. దీంతో ప్రధాని వెంటనే స్పందించారు. దానిని అక్కడి నుంచి తీసి తనతో ఉంచుకున్నారు. వెంటే ఉన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా సైతం తమ దేశ జెండా కాగితాన్ని తీసి తన సహాయకులకు అందించారు.

కీలక కార్యక్రమానికి జిన్‌పింగ్‌ డుమ్మా

బ్రిక్స్‌లోని కీలక సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గైర్హాజరయ్యారు. ఆయన తరఫున పాల్గొన్న వాణిజ్య మంత్రి అమెరికానుద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. జిన్‌పింగ్‌ గైర్హాజరీకి కారణం వెల్లడించలేదు.

రమఫోసా, మోదీ భేటీ

దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు రమఫోసాతో మోదీ బుధవారం భేటీ అయ్యారు. దక్షిణార్థ గోళంలోని దేశాల గళాన్ని గట్టిగా వినిపించే దిశగా పని చేయాలని అనుకున్నారు. ద్వైపాక్షిక అంశాల్లో పురోగతిని సమీక్షించారు.

పశ్చిమ దేశాలు చేస్తున్న యుద్ధం: పుతిన్‌

ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో పశ్చిమ దేశాల ప్రేరేపిత యుద్ధానికి ముగింపు పలికి, అక్కడి ప్రజలకు విముక్తి కల్పించే దిశగా ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. త్వరలో దీనికి ముగింపు పలుకుతామని చెప్పారు. బ్రిక్స్‌ సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు వారెంటున్న నేపథ్యంలో అరెస్టు చేస్తారనే అనుమానంతో ఆయన సదస్సులో నేరుగా పాల్గొనలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని