ఆర్టీసీ ఉద్యోగులకు ఏ పింఛనిస్తారో?

‘ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పాత పింఛను పథకాన్ని (ఓపీఎస్‌) మాకు కూడా అమలు చేస్తారనే ఆశతో ప్రభుత్వంలో విలీనానికి అంతా సమ్మతించాం. ఇప్పటి వరకు ఏ పింఛను ఇస్తారనేది కూడా స్పష్టత ఇవ్వడం లేదు.

Updated : 24 Aug 2023 09:15 IST

ప్రభుత్వంలో విలీనమై 32 నెలలైనా స్పష్టత కరవు
పాత పింఛను పథకం  అమలుపై  ఉద్యోగుల ఆశ
ఆ ఊసే ఎత్తని సర్కారు

ఈనాడు-అమరావతి: ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పాత పింఛను పథకాన్ని (ఓపీఎస్‌) మాకు కూడా అమలు చేస్తారనే ఆశతో ప్రభుత్వంలో విలీనానికి అంతా సమ్మతించాం. ఇప్పటి వరకు ఏ పింఛను ఇస్తారనేది కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఏం చేస్తారో కూడా తెలీదు’ ఇది ప్రతి ఆర్టీసీ (ప్రజా రవాణా శాఖ-పీటీడీ) ఉద్యోగి మనోగతం. ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో 2020 జనవరి 1న విలీనం చేశారు. వీరికోసం కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేశారు. ఇది జరిగి 32 నెలలవుతున్నా ఇప్పటి వరకూ ఉద్యోగుల పింఛను విషయంలో నిర్ణయం తీసుకోకుండా సర్కారు దోబూచులాడుతోంది. పాత పింఛను పథకం, భాగస్వామ్య పింఛను పథకం (సీపీఎస్‌), కొత్తగా అమలు చేస్తామని చెబుతున్న గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌).. వీటిలో ఏది వర్తిస్తుందనేది కూడా చెప్పటం లేదు.

ప్రజా రవాణా శాఖలో 51 వేల మంది ఉద్యోగులు ఉండగా.. వచ్చే ఏడాది జనవరి నుంచి పదవీ విరమణలు మొదలు కానున్నాయి. వీరికి ఏ పింఛను వస్తుందో తెలియక అంతా గందరగోళంలో ఉన్నారు. ఆర్టీసీలో ఉన్నపుడు రిటైరైతే.. ఉద్యోగులు, సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్న ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజన పథకం (ఎస్‌ఆర్‌బీఎస్‌) ట్రస్ట్‌ నుంచి నగదు ప్రయోజనం కింద నెలకు రూ.1,000 నుంచి రూ.3,200 వరకు చెల్లించేవారు. ఈపీఎఫ్‌-95 కింద మరికొంత పింఛను వచ్చేది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక ఎస్‌ఆర్‌బీఎస్‌ను రద్దు చేశారు. ప్రస్తుతానికి వారికి ఈపీఎఫ్‌-95 పింఛను ఒక్కటే ఉంది. విలీన సమయంలో ఈపీఎఫ్‌ గానీ, సీపీఎస్‌ గానీ ఏదో ఒకటి ఎంచుకోవచ్చని సూచించారు. ఇటీవల ప్రభుత్వంలోని సీపీఎస్‌ ఉద్యోగులకు గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌) అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలపగా, పీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగులకు ఇది వర్తిస్తుందా లేదా  అనేది స్పష్టత ఇవ్వలేదు.


అధిక పింఛనులోనూ సందేహాలే

గ్రాట్యుటీ, పదోన్నతులు, సెలవుల లెక్కింపు, ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌, మాస్టర్‌ స్కేల్స్‌, సీనియారిటీ తదితరాలు అన్నింటిలోనూ ఆర్టీసీ ఉద్యోగులు ఏ తేదీన విధుల్లో చేరారనేది పరిగణనలోకి తీసుకుంటున్నారు. పింఛను విషయంలో కూడా అదే ప్రామాణికం కావాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ తదితరులను పదే పదే కలిసి వినతులు ఇస్తున్నప్పటికీ ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఈపీఎఫ్‌లో హయ్యర్‌ పింఛనుకు ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగుల్లో 2014 తర్వాత రిటైరయినవారికి పీఎఫ్‌ కార్యాలయం నుంచి నోటీసులు వస్తున్నాయి. ఎంత మొత్తం జమ చేయాల్సి ఉంటుందో అందులో పేర్కొంటున్నారు. పింఛనుగా నెలకు ఎంత ఇస్తారనేది స్పష్టత ఇవ్వకుండా, రూ.లక్షల్లో ఎలా జమ చేయగలమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు