డిగ్రీ సింగిల్‌ మేజర్‌ కిచిడీ… సిలబస్‌?

డిగ్రీ సింగిల్‌ మేజర్‌లో మొదటి సెమిస్టర్‌కు తీసుకొచ్చిన సిలబస్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు ఒక సబ్జెక్టులో నిపుణత సాధించేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్న ఉన్నత విద్యామండలి మొదటి సెమిస్టర్‌లో మూడు సబ్జెక్టుల విధానాన్ని తీసుకొచ్చింది.

Updated : 24 Aug 2023 06:26 IST

ఒకే సబ్జెక్టులో నిపుణత  అంటూ మాయ
ఒక్క పేపర్‌లో మూడు సబ్జెక్టులు
మూల్యాంకనం ఎలా అంటున్న అధ్యాపకులు

ఈనాడు, అమరావతి: డిగ్రీ సింగిల్‌ మేజర్‌లో మొదటి సెమిస్టర్‌కు తీసుకొచ్చిన సిలబస్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు ఒక సబ్జెక్టులో నిపుణత సాధించేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్న ఉన్నత విద్యామండలి మొదటి సెమిస్టర్‌లో మూడు సబ్జెక్టుల విధానాన్ని తీసుకొచ్చింది. ఇది కిచిడీ సిలబస్‌గా మారిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. మొదటి సమిస్టర్‌లో ఏడు పేపర్లు పెట్టారు. బీఎస్సీ గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, కంప్యూటర్‌ సైన్సులో ఏ సబ్జెక్టు మేజర్‌గా తీసుకున్నా ఒక్కటే సిలబస్‌ తీసుకొచ్చారు. ఒక పేపర్‌లో బెసిక్స్‌, అప్లికేషన్స్‌లో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, కంప్యూటర్‌లో వెబ్‌ టెక్నాలజీ పెట్టారు. రెండో పేపర్‌లో అడ్వాన్సుడ్‌ పెట్టారు. సింగిల్‌ మేజర్‌ అని చెప్పి మూడు సబ్జెక్టులు పెట్టడం వల్ల ముగ్గురు పాఠాలు చెప్పాల్సి వస్తోందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. పాఠాలు చెప్పేవరకు కొంత ఇబ్బంది ఉన్నా సర్దుబాటు చేసుకుంటున్నామని, మూడు సబ్జెక్టులపై ఒకే ప్రశ్నపత్రంలో ప్రశ్నలు వస్తాయి కనుక వీటిని మూల్యాంకనం ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో ప్రశ్నపత్రాన్ని ముగ్గురు అధ్యాపకులు మూల్యాంకనం చేయాలా? సాధారణంగా అధ్యాపకులు ఎమ్మెస్సీలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రం సబ్జెక్టులను చదివినా బోధన వృత్తిలోకి వచ్చిన తర్వాత ఒక్క సబ్జెక్టు పైనే దృష్టి సారిస్తారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న వారు గత కొన్నేళ్లుగా ఏదో ఒక సబ్జెక్టు మాత్రమే బోధిస్తున్నారు. బెసిక్స్‌లో ఒక్క ఉపాధ్యాయుడే పాఠాలు చెప్పినా అడ్వాన్స్‌కు వచ్చేసరికి ముగ్గురు చెప్పాల్సి వస్తుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు మూడు సబ్జెక్టులపై రాసే ప్రశ్నపత్రాలను ముగ్గురితో ఎలా మూల్యాంకనం చేయిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. అన్ని కోర్సులకు కంప్యూటర్‌ను పెట్టారు. ఈ విధానం బాగున్నా ఇందులో వెబ్‌ టెక్నాలజీ, నెట్‌వర్కింగ్‌ను పెట్టారు. ఇంటర్మీడియట్‌లో ఎలాంటి కంప్యూటర్‌ కోర్సు చదవని విద్యార్థులు దీన్ని నేర్చుకోవడం కష్టమని పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని