Chandrayaan 3: చంద్రయానంలో మన జాబిలమ్మలు!

అల్లంత దూరాన ఉన్న జాబిలమ్మను చూసి మురిసిపోతుంటాం.. ‘చందమామ రావె.. జాబిల్లి రావె..’ అని పాడుతూ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తాం. ఇలా చూసి మురిసిపోవడం కాదు.. జాబిల్లి పైకి అడుగుపెట్టే మార్గాన్ని సుగమం చేయడంలో కీలక పాత్ర పోషించారు కొందరు మహిళలు.

Updated : 24 Aug 2023 07:34 IST

అల్లంత దూరాన ఉన్న జాబిలమ్మను చూసి మురిసిపోతుంటాం.. ‘చందమామ రావె.. జాబిల్లి రావె..’ అని పాడుతూ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తాం. ఇలా చూసి మురిసిపోవడం కాదు.. జాబిల్లి పైకి అడుగుపెట్టే మార్గాన్ని సుగమం చేయడంలో కీలక పాత్ర పోషించారు కొందరు మహిళలు. ఇందుకు చంద్రయాన్‌-3 ప్రయోగమే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్‌లో తెర పైకి కనిపించే మహిళా సైంటిస్టులు తక్కువే అయినా.. తెర వెనుక ప్రయోగం కోసం సుమారు 54 మంది మహిళా ఇంజినీర్లు/సైంటిస్టులు నేరుగా పనిచేసినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమైన కొందరు కీలక మహిళా సైంటిస్టుల గురించి తెలుసుకుందాం..


నక్షత్రాలను చేరాలని..!

అంతరిక్ష రంగంలో చేరాలనే తన చిన్ననాటి కలను సాకారం చేసుకొని తనదైన పనితనంతో ‘రాకెట్ ఉమన్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకున్నారు రీతూ కరిధాల్. ప్రస్తుతం విజయవంతమైన ‘చంద్రయాన్‌-3’ ప్రయోగానికి మిషన్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన రీతూ.. దీని కమాండింగ్‌ బాధ్యతల్నీ నిర్వర్తించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న కీలక శాస్త్రవేత్తల బృందంలో రీతూ ఒక్కరే మహిళ కావడం విశేషం.

లక్నో యూనివర్సిటీ నుంచి భౌతికశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆమె.. బెంగళూరులోని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’లో ఎంటెక్ చేశారు. లక్నోలో పుట్టిపెరిగిన ఆమె చిన్నతనంలో నక్షత్రాలను, చంద్రుడిని చూస్తూ ఎప్పటికైనా వాటిపై పరిశోధనలు చేయాలని, అంతరిక్షం వెనకున్న గుట్టును బయటపెట్టాలని కలలు కనేవారట. అయితే ఆమె చదువుకునే రోజుల్లో ఇప్పుడున్నట్లుగా కోచింగ్ ఇనిస్టిట్యూట్స్, ట్యూషన్స్.. వంటి సదుపాయాలు లేవట! అయినా ఇంతలా రాణించడానికి గల కారణమేంటని అడిగితే.. స్వీయ ప్రేరణే అంటారామె. ప్రతి క్షణం తనని తాను ప్రోత్సహించుకుంటూ చదువులో రాణించానంటారు రీతూ.

1997లో ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా విధుల్లో చేరిన ఆమె.. ‘మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్)’, ‘మంగళ్‌యాన్’.. వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతం అవడంలో రీతూ పోషించిన పాత్ర అసాధారణం అని చెప్పుకోవాలి. ఇక 2019లో చేపట్టిన ‘చంద్రయాన్‌-2’ ప్రాజెక్ట్‌కి కూడా మిషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా నిరంతరాయంగా తన విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ తన ఇద్దరు పిల్లల బాధ్యతను సైతం చక్కగా నిర్వర్తిస్తూ నేటి మహిళలకు వర్క్-లైఫ్ బ్యాలన్స్ పాఠాలు నేర్పుతున్నారు రీతూ. తన పనితనానికి గుర్తింపుగా 2007లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ‘ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు’ అందుకున్నారు. అలాగే తన నాయకత్వంలో విజయవంతమైన ‘మామ్’ ప్రాజెక్ట్ గురించి టెడ్, టెడెక్స్.. వంటి వేదికలపై కూడా తన గళాన్ని వినిపించారీ మహిళా సైంటిస్ట్.


ఐదు ఉపగ్రహాల తయారీలో..!

అంతరిక్ష రంగంలో పని చేయాలన్న లక్ష్యాన్ని చిన్న వయసులోనే నిర్దేశించుకున్నారు చిత్తూరుకు చెందిన కల్పన కాళహస్తి. చెన్నైలో బీటెక్‌ ఈసీఈ చదివిన ఆమె.. 2000లో ఇస్రోలో శాస్త్రవేత్తగా విధుల్లో చేరారు. ఆమె తండ్రి మద్రాసు హైకోర్టులో ఉద్యోగి. తల్లి గృహిణి. మొదట శ్రీహరికోటలో ఐదేళ్లపాటు విధులు నిర్వర్తించిన కల్పన.. 2005లో బదిలీపై బెంగళూరులోని ఉపగ్రహ కేంద్రానికి వెళ్లారు. అక్కడే ఐదు ఉపగ్రహాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. తాజాగా విజయవంతమైన చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌కు అసోసియేట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆమె.. చంద్రయాన్‌-2 ప్రాజెక్టులోనూ కీలక పాత్ర పోషించారు.


కాఫీ వ్యాపారి కూతురు!

అందరిలా కాకుండా అరుదైన రంగాల్ని ఎంచుకోవాలని, ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని ఆరాటపడుతుంటారు కొందరు మహిళలు. అయితే అందుకు తపనే కాదు.. పట్టుదలా కావాలి. ఇలా పట్టు వీడకుండా తన అంతరిక్ష కలను సాకారం చేసుకున్నారు కర్ణాటకలోని తుప్పూరు గ్రామానికి చెందిన మహిళా శాస్త్రవేత్త డాక్టర్‌ కె. నందిని. ఆమె తండ్రి కేశవమూర్తి కాఫీ వ్యాపారం చేస్తుంటారు.. తల్లి మంగళ గృహిణి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పైచదువులు చదివిన నందిని.. పీహెచ్‌డీ పూర్తిచేశాక బెంగళూరు ఇస్రోలో విధుల్లో చేరారు. గత ఎనిమిదేళ్లుగా అక్కడే శాస్త్రవేత్తగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆమె.. తాజాగా విజయవంతమైన చంద్రయాన్‌-3 సైంటిస్టుల బృందంలో ఒకరు. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియలోనూ కీలకంగా వ్యవహరించిన నందిని.. మూడేళ్ల క్రితం చేపట్టిన ‘చంద్రయాన్‌-2’ ప్రయోగంలోనూ ముఖ్య భూమిక పోషించారు.


ప్రతిభతో అందలమెక్కి..!

గత కొన్నేళ్లుగా ఇస్రోలో సీనియర్‌ సైంటిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు మంగళూరు వాసి సుమన వాకే. అంతరిక్ష రంగంలో మగవాళ్లే ఎక్కువగా కనిపించే తరుణంలో తాను తన కెరీర్‌ను ఇదే రంగంలో కొనసాగించాలని నిర్ణయించుకున్నారామె. పాఠశాల దశ నుంచే ప్రతిభ గల విద్యార్థినిగా పేరు తెచ్చుకున్న సుమన.. కెనరా ప్రి-గ్రాడ్యుయేషన్‌ కాలేజీలో చదువుకున్నారు. ఇస్రోలో తన సుదీర్ఘ కెరీర్‌లో భాగంగా.. పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగమైన ఆమె.. తాజాగా ‘చంద్రయాన్‌-3’ విజయవంతమవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ ప్రయోగ విజయాన్ని, అందులో సుమన పాత్రను మంగళూరు ప్రజలు సెలబ్రేట్‌ చేసుకుంటూ.. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.


కామెంట్రీ.. ఆమెదే!

అంతరిక్ష ప్రయోగాల్లో.. రాకెట్‌ డిజైనింగ్‌, ఇతర హార్డ్‌వేర్‌ పనులే కాదు.. దాన్ని నింగిలోకి పంపించాక.. అది నిర్దేశిత కక్ష్యలోనే తిరుగుతోందా? ఒక దశ తర్వాత మరో దశ పూర్తి చేస్తోందా? అన్న విషయాలు చూస్తే మనకు అర్థం కావు. అందుకే ఆయా విషయాల గురించి విశ్లేషించి చెప్పే బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు పి. మాధురి. రాకెట్‌ లాంచ్‌ కామెంటేటర్‌గా గుర్తింపు పొందిన ఆమె.. ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన ఎన్నో రాకెట్లకు కామెంటేటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ‘చంద్రయాన్‌-3’ కోసమూ పనిచేశారామె. ప్రస్తుతం శ్రీహరికోట రాకెట్‌ పోర్ట్‌ నుంచి ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తనదైన నైపుణ్యాలతో ప్రముఖులు, ఇతర సైంటిస్టుల ప్రశంసలందుకున్నారు మాధురి.

వీరితో కలుపుకొని మొత్తంగా 54 మంది మహిళల బృందం చంద్రయాన్‌-3 ప్రాజెక్టు రూపకల్పనలో నేరుగా పాలుపంచుకుందని ఇస్రో పేర్కొంది. ఈ క్రమంలో ఈ మిషన్‌లోని వివిధ వ్యవస్థలకు డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లుగా, ప్రాజెక్ట్‌ మేనేజర్లుగా ఈ మహిళా శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. ఇక ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఈ మహిళల కృషి, పట్టుదలను ప్రత్యేకంగా కొనియాడారు. ఇక తాజాగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ కూడా విజయవంతం కావడంతో ‘చంద్రయాన్‌-3’ బృందంపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారాయన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్