logo

మౌనం వీడని తుమ్మల

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి మాంత్రికుడిగా పేరొందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు భారాస నుంచి పాలేరు టికెట్‌ దక్కకపోవడంపై ఆయన అభిమానులు, ఆపార్టీలోని ఓ వర్గం నాయకులు రగిలిపోతున్నారు.

Updated : 24 Aug 2023 05:41 IST

ఈటీవీ- ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి మాంత్రికుడిగా పేరొందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు భారాస నుంచి పాలేరు టికెట్‌ దక్కకపోవడంపై ఆయన అభిమానులు, ఆపార్టీలోని ఓ వర్గం నాయకులు రగిలిపోతున్నారు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొత్త నాయకులు గులాబీ గూటికి చేరినా ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీపై నోరెత్తకుండా క్రమశిక్షణతో మెలిగిన నేతకు టికెట్‌ నిరాకరించారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని భగ్గుమంటున్నారు.

నియోజకవర్గాల వారీగా సమావేశాలు

భారాస నుంచి పాలేరు టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆపార్టీలోని ఓ వర్గం నాయకులు, ఉభయ జిల్లాల్లోని ఆయన అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో మంగళవారం సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తుమ్మల పాలేరు బరిలో నిలవాల్సిందేనని తీర్మానించారు. ఇందుకోసం ఆయన తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వైరా, మధిర, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో తుమ్మల వర్గం నేతలు వేర్వేరుగా బుధవారం సమావేశమయ్యారు. రాజకీయాల్లో అపార అనుభవంతోపాటు ఉభయ జిల్లాల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన తుమ్మలకు భారాస అధిష్ఠానం మొండిచెయ్యి చూపిందంటూ ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి తుమ్మల బరిలో నిలవాలంటూ పలువురు బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.


25న ఖమ్మం జిల్లాకు రానున్న మాజీ మంత్రి

భారాస మూడు రోజుల క్రితం అభ్యర్థుల జాబితా ప్రకటించింది. పాలేరులో సిట్టింగు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికే మరోసారి టికెట్‌ కేటాయించింది. అయినా మాజీ మంత్రి తుమ్మల స్పందించలేదు. ఉభయ జిల్లాల్లోని భారాసలోని ఓ వర్గం నాయకులు, తుమ్మల అభిమానుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వాస్తవానికి 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మల కాస్త స్తబ్దుగా ఉన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలను కలవటం, పరామర్శలు, శుభాకార్యాలకు వెళ్లటం మినహా పార్టీపరంగా కార్యక్రమాలు చేపట్టలేదు. పాలేరుకు గోదావరి జలాలు తీసుకురావడమే లక్ష్యమని, అందుకోసం మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తుమ్మల పలుమార్లు ఉద్ఘాటించారు. ఈ ఏడాది జనవరి 1న ఖమ్మం గ్రామీణం మండలంలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీ, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. జిల్లాకు శుక్రవారం ఆయన రానున్నారు. నాయకన్‌గూడెం వద్ద తుమ్మలకు స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లుచేస్తున్నారు. ‘మన ఖమ్మం- మన తుమ్మల- మన భవిష్యత్తు’ నినాదంతో తుమ్మల వర్గీయులు కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు