Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jul 2023 21:04 IST

1. యూసీసీకి మేం వ్యతిరేకం.. తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్‌

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చి చెప్పారు. యూసీసీ వల్ల అన్ని వర్గాల ప్రజల్లో అయోమయం నెలకొంటుందన్నారు. ప్రత్యేక సంస్కృతి కలిగిఉన్న జాతులు, మతాలకు ఇబ్బందిగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భాజపా దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం చేస్తోందని విమర్శించారు. భాజపా ఇప్పటికే పలు రకాలుగా ప్రజల మధ్య చిచ్చుపెట్టిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రధాని మోదీకి లౌకికవాదం అంటే అలర్జీ: అసదుద్దీన్‌ ఒవైసీ

యూసీసీ వస్తే అన్ని వర్గాలకూ నష్టం జరుగుతుందని మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులతో కలిసి.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత అసదుద్దీన్‌ మాట్లాడారు. విజ్ఞప్తులతో సీఎంకు ఓ నోట్‌ ఇచ్చినట్లు తెలిపారు. ‘‘బిల్లును భారాస వ్యతిరేకిస్తుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని ఏపీ సీఎంను కూడా కోరుతున్నాం. యూసీసీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగడతాం’’ అన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాజయ్య.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి: కడియం

స్టేషన్‌ ఘన్‌పూర్ భారాస ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజయ్య పార్టీ లైన్‌ దాటి మాట్లాడుతున్నారని.. అయినప్పటికీ మీరు తొందరపడొద్దని పార్టీ పెద్దలు తనకు సూచించినట్లు కడియం పేర్కొన్నారు. అందువల్లే తాను రాజయ్యపై ఎలాంటి విమర్శలు చేయకుండా ఊరుకున్నట్లు చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏఐ సరికొత్త ప్రయోగం...వార్తలు చదువుతున్న కృత్రిమ యాంకర్!

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రోజురోజుకూ చాలా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దాన్ని అభివద్ధి చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఈ టెక్నాలజీని ఉపయోగించి వార్తలు చదివించే కృత్రిమ యాంకర్‌ను తయారుచేశారు. ఒడిశాలోని ఓటీవీ (OTV) అనే వార్తా ఛానెల్‌ లిసా (Lisa) అనే కృత్రిమ మహిళా యాంకర్‌ను సిద్ధం చేశారు. ఈ మేరకు లిసా ఆవిష్కరణ కార్యక్రమం భువనేశ్వర్‌లో జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారాసకు కోకాపేటలో 11 ఎకరాలు.. హైకోర్టులో పిల్‌

భారాసకు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయించడంపై.. హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) పిల్‌ దాఖలు చేసింది. కోకాపేటలో ఖరీదైన భూమిని భారాస పార్టీ కార్యాలయం కోసం కేటాయించారని పిల్‌లో పేర్కొంది. ఎకరానికి రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారని.. కేవలం అయిదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారని వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.హిమాన్షు పెద్ద మనస్సు.. రూ.కోటి ఖర్చుతో పాఠశాల ఆధునికీకరణ

ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు (Himanshu Rao Kalvakuntla) పెద్ద మనస్సు చాటుకున్నారు. ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని సుమారు రూ.కోటి వెచ్చించి కార్పొరేట్‌ స్కూల్ తరహాలో తీర్చిదిద్దారు. తాను సీఏఎస్ అధ్యక్షుడిగా తన పాఠశాలలో సేకరించిన నిధులతో ఈ పనులు చేపట్టారు. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  సముద్రంలో మూడు పడవలు మాయం.. లభించని 300 మంది ఆచూకీ..!

గ్రీస్‌ (Greece)లో ఇటీవల అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న ఓ పడవ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 80 మందికిపైగా మృతి చెందారు. దాదాపు 500 మంది ఆచూకీ లేకుండా పోయింది. ఈ విషాదం మరువకముందే.. తాజాగా మరో మూడు పడవలు (Migrant boats) అట్లాంటిక్‌ మహాసముద్రంలో కనిపించకుండా పోవడం కలవరపరుస్తోంది. ఆ బోట్లలో దాదాపు 300 మందికిపైగా వలసజీవులు (Migrants) ఉన్నట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ఏపీ 31’లో సీఐ స్వర్ణలత హీరోయిన్‌ కాదు.. దర్శకుడు క్లారిటీ

ఏపీ 31 సినిమాలో ఏఆర్‌ సీఐ స్వర్ణలత (CI Swarnalatha) హీరోయిన్‌ కాదని దర్శకుడు కేవీఆర్‌ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఏపీ 31’లో స్వర్ణలత పెట్టుబడి పెట్టలేదని.. ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ లహరి హీరోయిన్‌గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్‌ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కోర్టు ధిక్కరణ కేసు.. ఏపీఐఐసీ ఎండీకి జైలు శిక్ష: హైకోర్టు తీర్పు

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ కుమార్‌కు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రవీణ్‌ కమార్‌ ప్రస్తుతం ఏపీఐఐసీ ఎండీగా ఉన్నారు. గతంలో విశాఖపట్నం కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. భీములపట్నం మండలంలోని కాపులప్పాడ గ్రామం పరిధిలో ఏడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేసి.. నిషేధిత భూముల జాబితాలో చేర్చారని అభియోగాలున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 26 రఫేల్‌, 3 సబ్‌మెరైన్లు.. ఫ్రాన్స్‌తో రూ.90వేల కోట్ల డీల్‌..?

భారత నౌకాదళంలోకి అత్యాధునిక రఫేల్‌ యుద్ధవిమానాలను (Rafale fighter aircraft) చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌ నుంచి 26 రఫేల్‌ విమానాలతోపాటు మూడు స్కార్పెన్‌ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలుకు సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి రక్షణ బలగాలు ఇప్పటికే సదరు శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని