AI Anchor: ఏఐ సరికొత్త ప్రయోగం...వార్తలు చదువుతున్న కృత్రిమ యాంకర్!

ఒడిశాలోని OTV తాజాగా కృత్రిమ మేధస్సు (AI)తో వార్తలు చదివే కృత్రిమ యాంకర్‌ను (AI Anchor Lisa) తయారు చేసింది.

Updated : 10 Jul 2023 19:20 IST

భువనేశ్వర్‌ : కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రోజురోజుకూ చాలా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దాన్ని అభివద్ధి చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఈ టెక్నాలజీని ఉపయోగించి వార్తలు చదివించే కృత్రిమ యాంకర్‌ను తయారుచేశారు. ఒడిశాలోని ఓటీవీ (OTV) అనే వార్తా ఛానెల్‌ లిసా (Lisa) అనే కృత్రిమ మహిళా యాంకర్‌ను సిద్ధం చేశారు. ఈ మేరకు లిసా ఆవిష్కరణ కార్యక్రమం భువనేశ్వర్‌లో జరిగింది. టీవీ జర్నలిజంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐ న్యూస్‌ యాంకర్‌ను పరిచయం చేశామని ఎండీ జగి మంగత్‌ పండా తెలిపారు. రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ యాంకర్‌ చాలా రకాల భాషలు మాట్లాడగలదని, ప్రస్తుతం ఇంగ్లిష్‌, ఒడియాలో వార్తలు చదువుతోందని వార్తా సంస్థ ఎండీ లితిషా మంగత్‌ పండా తెలిపారు. ‘‘ఒడియాలో లిసాకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ మేం సాధించాం. మనుషులు మాట్లాడేంత స్పష్టంగా ఉచ్చారణ లేకపోయినా.. గూగుల్‌ అసిస్టెంట్‌ కంటే మెరుగ్గానే ఉంటుంది. త్వరలోనే ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా తయారు చేస్తాం’’ అని ఆమె పేర్కొన్నారు. 

ఓటీవీ (OTV) భువనేశ్వర్‌కు చెందిన వార్తా సంస్థ. ఇది 1997లో భువనేశ్వర్, కటక్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత నెమ్మదిగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలకు విస్తరించింది. దీనిని జగి మంగత్ పండా ప్రారంభించారు. ఓటీవీ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇది 2006లో కేబుల్ నుంచి శాటిలైట్ ఛానెల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని