Kadiyam Vs Rajaiah: రాజయ్య.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి: కడియం

స్టేషన్‌ ఘన్‌పూర్ భారాస ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రాజయ్య చేసిన విమర్శలపై కడియం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated : 10 Jul 2023 18:45 IST

వరంగల్‌: స్టేషన్‌ ఘన్‌పూర్ భారాస ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజయ్య పార్టీ లైన్‌ దాటి మాట్లాడుతున్నారని.. అయినప్పటికీ మీరు తొందరపడొద్దని పార్టీ పెద్దలు తనకు సూచించినట్లు కడియం పేర్కొన్నారు. అందువల్లే తాను రాజయ్యపై ఎలాంటి విమర్శలు చేయకుండా ఊరుకున్నట్లు చెప్పారు. వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కడియం.. రాజయ్య తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

‘‘జిల్లాలోని హిమ్మత్‌నగర్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన రాజయ్య.. అదే తీరుతో తీవ్ర స్థాయిలో నాపై విమర్శలు చేశారు. అది చూశాక కూడా ఆయన చేస్తోన్న విమర్శలపై నేను వివరణ ఇచ్చుకోకపోతే.. ప్రజలు నన్ను అపార్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే అసలు విషయం చెబుతున్నా. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అందుకే 4 రోజులు ఆగి ఇవాళ మీడియా ముందుకు వచ్చా. రాజయ్య వైద్యుడై ఉండి.. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నా తల్లి కులం, నా కులం గురించి కూడా మాట్లాడటం దారుణం. పిల్లలకు తండ్రి కులమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. తల్లి మాత్రమే సత్యం. తండ్రి అనేది అపోహ అని రాజయ్య దారుణంగా మాట్లాడారు. సమాజంలో ప్రతి తల్లిని అవమానించేలా రాజయ్య మాట్లాడారు.

నేను నోరు విప్పితే రాజయ్య కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటు. అభివృద్ధి చేసిన నిన్ను పల్లె నిద్రలో ఎందుకు నిలదీశారు?పార్టీకి కట్టుబడి ఉంటా.. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్థిని గెలిపించి తీరుతాం. నా బిడ్డను చూసి రాజయ్య భయపడుతున్నారు. గెలిచే అవకాశం ఉన్నవారికే పార్టీ టికెట్ ఇస్తుంది. నీ మాటలపై స్పందించే అవసరం లేదు.. ప్రజలకు వివరించాలని స్పందిస్తున్నా. ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకో. ముక్కును నేలకు రాసి బేషరతుగా నాకు క్షమాపణ చెప్పాలి. నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే పోటీ నుంచి వైదొలుగుతా’’ అని కడియం సవాల్‌ విసిరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని