26 రఫేల్‌, 3 సబ్‌మెరైన్లు.. ఫ్రాన్స్‌తో రూ.90వేల కోట్ల డీల్‌..?

భారత నౌకాదళంలోకి అత్యాధునిక రఫేల్‌ యుద్ధవిమానాలను (Rafale fighter aircraft) చేర్చడంలో భాగంగా ఫ్రాన్స్‌ నుంచి 26 రఫేల్‌ విమానాలతోపాటు మూడు స్కార్పెన్‌ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Updated : 10 Jul 2023 20:56 IST

దిల్లీ: భారత నౌకాదళంలోకి అత్యాధునిక రఫేల్‌ యుద్ధవిమానాలను (Rafale fighter aircraft) చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌ నుంచి 26 రఫేల్‌ విమానాలతోపాటు మూడు స్కార్పెన్‌ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలుకు సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి రక్షణ బలగాలు ఇప్పటికే సదరు శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అయితే ఈ వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటన (Modi France tour) సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రకటన వెలువడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జులై 13, 14 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు.

ప్రతిపాదనల ప్రకారం.. 22 సింగిల్‌ సీటర్‌ రఫేల్‌ మెరైన్‌ విమానాలతోపాటు నాలుగు శిక్షణా విమానాలు భారత నౌకాదళానికి అందనున్నాయి. ఈ ఒప్పందం విలువ రూ.90వేల కోట్లుగా ఉండవచ్చని అంచనా. కచ్చితమైన విలువ మాత్రం ఒప్పందం పూర్తైన తర్వాతే తెలియనుంది. అయితే, గతంలో 36 రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు సమయంలో అనుసరించిన విధంగా.. ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని భారత్‌, ఫ్రాన్స్‌లు ఏర్పాటు చేయనున్నాయని తెలుస్తోంది. ఈ కొనుగోలు ప్రతిపాదనలపై ఇప్పటికే రక్షణశాఖ ఉన్నతాధికారులు చర్చించారని.. మరికొన్ని రోజుల్లోనే రక్షణ పరికరాల కొనుగోలు మండలి ఆమోదం పొందనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని