Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 23 Feb 2024 20:59 IST

1. మేడారం వైపు భారీగా ట్రాఫిక్ జామ్‌

మేడారం మహా జాతరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది. దారులన్నీ మేడారానికి అన్నట్టుగా.. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం - తాడ్వాయి మధ్య సుమారు 15 కిలోమీటర్ల మేర, పస్రా నుంచి గోవిందరావుపేట వరకు ఐదు కి.మీ  మేర ట్రాఫిక్ జామ్‌ అయింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా

దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్‌ నేత మల్లు రవి రాజీనామా చేశారు. ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకే పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. వారం క్రితమే రాజీనామా లేఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పంపినట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉంటానని ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెదేపా-జనసేన తొలి జాబితా.. శనివారమే కీలక ప్రకటన?

అభ్యర్థుల ప్రకటనపై తెలుగుదేశం-జనసేన నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం ప్రకటించే అవకాశముందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు దీనిపై రెండు పార్టీలు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కూటమి తరఫునే లోక్‌సభకు పోటీ చేస్తా: ఎంపీ రఘురామ

త్వరలో వైకాపాకు రాజీనామా చేయనున్నట్టు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 28న తాడేపల్లిగూడెంలో జరిగే తెదేపా-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొననున్నట్టు చెప్పారు. కూటమి తరఫునే నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అశ్రునయనాల మధ్య ముగిసిన లాస్య నందిత అంత్యక్రియలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మేడారంలో కొండెక్కిన కోడి ధర..

మేడారం మహా జాతరలో కోళ్ల ధరలు కొండెక్కాయి. బుధ, గురువారాల్లో లైవ్‌ కిలో కోడి ధర రూ.150-200 మధ్య ఉండగా.. శుక్రవారం ఇది ఏకంగా రూ.500కు పెరిగింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో చాలా దుకాణాల్లో కోళ్లు అయిపోయాయి. సరఫరా తగ్గడంతో విక్రేతలు ధరలను అమాంతం పెంచేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ పాటిల్

సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ పాటిల్ జీవన్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయన స్థానంలో మిక్కిలినేని మను చౌదరి నియమితులయ్యారు. జనగామ కలెక్టర్‌గా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్‌ను నియమించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చైనాది ‘మైండ్‌ గేమ్‌’.., రష్యాది పాలనా దక్షత : ఎస్‌.జైశంకర్‌

రష్యా (Russia) ఎంతో పాలనా దక్షత కలిగిన శక్తిమంతమైన దేశమని, అది ఆసియా వైపు చూస్తోందని ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాటి పతనంపై మాట్లాడిన ఆయన.. బీజింగ్‌తో రష్యాకు పెరుగుతోన్న సాన్నిహిత్యంపైనా స్పందించారు. పశ్చిమ దేశాల విధానాలే ఆ రెండు దేశాలను (Russia-China) దగ్గర చేస్తున్నాయని అన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘నేను మలాలాను కాదు’: కశ్మీరీ యువతి ప్రసంగం వైరల్‌

‘నేను మలాలాను కాదు’ అంటూ బ్రిటిష్ పార్లమెంట్ భవనంలో కశ్మీరీ హక్కుల కార్యకర్త యానా మిర్‌(Yana Mir) చేసిన ప్రసంగం ప్రస్తుతం వైరల్‌గా మారింది.  మొత్తం జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) అధ్యయనం కోసం ఏర్పడిన జమ్మూకశ్మీర్ స్టడీ సెంటర్(JKSC) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విశాఖలో ఓట్ల తొలగింపు.. 10 మంది వైకాపా బీఎల్‌ఏలపై కేసు

నగరంలో ఓట్ల అక్రమాలపై ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అక్టోబరు 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో కొన్ని ఓట్లు తొలగించాలని దాదాపు 163 మంది ఒకటికి మించి ఫారం-7లు దాఖలు చేశారు. దాదాపు 5 వేల ఓట్లు రద్దు చేయాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని