Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 04 Dec 2023 20:59 IST

1. చెన్నైలో వర్ష బీభత్సం.. ఐదుగురి మృతి; ఐఫోన్ల ఉత్పత్తికి బ్రేక్‌!

మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడు అతలాకుతలమైంది. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న కుండపోత వానలకు చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.  రోడ్లన్నీ జలమయమై నదులను తలపిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ భారీ వర్షాల కారణంగా చెన్నైలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మిగ్‌జాం తుపాను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం- నెల్లూరు మధ్య ఈ అర్ధరాత్రి తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ప్రజాతీర్పును గౌరవిద్దాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం: కేసీఆర్‌

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత కేసీఆర్‌ (KCR)ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికైన భారాస ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని చెప్పారు. ఏమి జరుగుతుందో వేచి చూద్దామన్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం త్వరలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. నిజాంపట్నం వద్ద పదో నంబర్‌ ప్రమాద హెచ్చరిక.. తీరప్రాంత ప్రజల్లో ఉలిక్కిపాటు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. మిగ్‌జాం తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను నిజాంపట్నం సమీపంలో తీరం తాకవచ్చనే సూచనతో తీర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. మొత్తం 11 ప్రమాద హెచ్చరికలు ఉండగా.. 10వ నంబర్‌ ఎగరవేయడంతో తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని భయాందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. జియో ఎయిర్‌ఫైబర్‌లోనూ డేటా బూస్టర్‌ ప్లాన్‌.. ధర ఎంతంటే?

ఇటీవలే అందుబాటులోకి వచ్చిన 5జీ ఆధారిత ‘జియో ఎయిర్‌ఫైబర్‌ (Jio AirFiber)’ వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో కంపెనీ మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది డేటా బూస్టర్‌. దీని ధర రూ.401. దీన్ని యాక్టివేట్‌ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్‌ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్‌ అయ్యి ఉండాల్సిందే. రెగ్యులర్‌, మ్యాక్స్ పేరిట జియో ఎయిర్‌ఫైబర్‌ మొత్తం ఆరు బేసిక్‌ ప్లాన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. కనెక్షన్‌ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిలో ఏదో ఒక దాన్ని సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ముఖ్యమంత్రి.. మంత్రివర్గంపై కొలిక్కిరాని చర్చలు

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్న తరుణంలో సీఎల్పీ నాయకుడు ఎవరు? అనేదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఓ వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎవరా? అన్న దానిపై స్పష్టత రాకపోవడంతో ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండకపోవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

ఏపీ రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి సహాయమంత్రి కౌశల్‌కుమార్‌ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు మాస్టర్‌ ప్లాన్‌లు ఉన్నాయని స్పష్టం చేశారు. వీటిని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. మణిపుర్‌లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి

జాతుల మధ్య వైరం కారణంగా గత ఏడు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం శాంతి పునరుద్ధరణలో భాగంగా ఓ తిరుగుబాటు వర్గంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో ఘర్షణలు తగ్గుముఖం పడతాయని భావించారు. కానీ, సోమవారం మరోసారి రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాల్లో తొలిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈసారి అసెంబ్లీలో రాజవంశీయులకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా, ఆప్‌ నుంచి పోటీచేసిన ఏడుగురు రాజవంశీయులు ఓటమి చెందడమే ఇందుకు కారణం. వీరిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉపముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్‌ కూడా ఉండటం గమనార్హం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేత

తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల కోడ్‌ను ఈసీ ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో తెలంగాణలో అక్టోబర్‌ 9 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స.. త్వరలో దేశవ్యాప్తంగా అమలు!

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. రానున్న మూడు, నాలుగు నెలల్లో దీనిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. మోటార్‌ వాహనాల సవరణ చట్టం 2019లో (MV Act) భాగంగా దీనిని తీసుకురానున్నట్లు తెలిపాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని