Manipur Violence: మణిపుర్‌లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి

మణిపుర్‌లో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 13 మంది మృతి చెందారు.

Updated : 04 Dec 2023 18:25 IST

ఇంఫాల్: జాతుల మధ్య వైరం కారణంగా గత ఏడు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం శాంతి పునరుద్ధరణలో భాగంగా ఓ తిరుగుబాటు వర్గంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో ఘర్షణలు తగ్గుముఖం పడతాయని భావించారు. కానీ, సోమవారం మరోసారి రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. స్థానిక అధికారులు, అస్సాం రైఫిల్స్ (Assam Rifles) తెలిపిన వివరాల ప్రకారం..

‘‘సోమవారం తెల్లవారుజామున తెంగ్నౌపాల్ (Tengnoupal) జిల్లాలోని లితు (Leithu) గ్రామ సమీపం నుంచి ఓ తిరుగుబాటు బృందం మయన్మార్‌ వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న మరో సంస్థ సభ్యులు వారిపై కాల్పులు జరిపారు. ప్రతిగా అవతలి వర్గం కూడా కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే అస్సాం రైఫిల్స్ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. కాల్పుల ఘటనలో మృతి చెందిన వారు ఏ వర్గానికి చెందిన వారనేది  తెలియాల్సివుంది’’ అని స్థానిక అధికారి తెలిపారు. 

కొట్టుకుపోయిన కార్లు.. రన్‌వేపైకి వరద.. చెన్నైలో వర్ష బీభత్స దృశ్యాలు

గత వారం ఇంఫాల్‌ లోయలోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (UNLF)తో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతి చర్చలు ఫలప్రదం కావడంతో దిల్లీలో శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. ఆదివారం తెంగ్నౌపాల్ జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో కుకీ-జో గిరిజన వర్గాలు ఈ శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేశాయి. దీంతో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు మినహా రాష్ట్రమంతా ఇంటర్నెట్‌ సేవలను మణిపుర్ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని