ఆ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపేయాలి

రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. భారీవర్షాల నేపథ్యంలో విద్యుత్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

Published : 18 Aug 2020 01:59 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. భారీవర్షాల నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. నీట మునిగిన ప్రాంతాలు, గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరా నిలిపేయాలని సూచించారు. ముంపు తొలగిన వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని ప్రభాకర్‌రావు ఆదేశించారు.

కరీంనగర్‌ జిల్లాలో 220కేవీ సామర్థ్యం కలిగిన ఏడు టవర్లు భారీ వరదల వల్ల కొట్టుకుపోయాయని అధికారులు సీఎండీ దృష్టికి తెచ్చారు. వరంగల్ జిల్లాలో రెండు చోట్ల 33కేవీ సబ్‌స్టేషన్లు నీట మునిగాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు సీఎండీకి వివరించారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 54 గ్రామాలు నీట మునిగి ఉండగా ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశామన్నారు. 248 డిస్ర్టిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్‌లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశామన్నారు. ప్రాజెక్టుల్లో నీటిప్రవాహాలు ఉన్నందున అప్పర్‌ జూరాల, లోయర్‌ జారాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో మొత్తం 1200మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని సీఎండీ ప్రభాకర్‌రావుకు వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని