టి-కణాలు తగ్గితే కరోనా తీవ్రరూపం

కొవిడ్‌-19 బాధితుల్లో రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన కొన్ని కణాల క్షీణత కనిపిస్తోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కణాలు తగ్గడంతో వ్యాధి మరింత ముదురుతోందని పేర్కొన్నారు. కరోనా రోగులకు మరింత సమర్థంగా చికిత్స అందిచేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.....

Published : 01 May 2020 16:49 IST

శ్వాస ఇబ్బందుల కన్నా టి-కణాలపై దృష్టి పెట్టాలన్న శాస్త్రవేత్తలు

బీజింగ్‌: కొవిడ్‌-19 బాధితుల్లో రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన కొన్ని కణాల క్షీణత కనిపిస్తోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కణాలు తగ్గడంతో వ్యాధి మరింత ముదురుతోందని పేర్కొన్నారు. కరోనా రోగులకు మరింత సమర్థంగా చికిత్స అందిచేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

చైనా సైనిక వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇమ్యూనాలజీకి చెందిన జర్నల్‌లో వివరాలు ప్రచురించారు. ప్రతికూల రోగ నిరోధక ప్రతిస్పందనతో శరీరంలోని ‘టి కణాల’ సంఖ్య తగ్గుతోందని వీరు గుర్తించారు. ఇలా తగ్గడం వల్ల వ్యాధి మరింత తీవ్రం అవుతోందని కనుగొన్నారు. టి కణాలంటే తెల్ల రక్తకణాల్లోనే ఒక రకం. శరీర రోగ నిరోధక శక్తికి ఇవెంతో కీలకం.

కొవిడ్‌-19 రోగుల్లో సైటోకైన్‌ ద్రవం ఎక్కువగా ఉంటోందని శాస్త్రవేత్తలు అన్నారు. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కాపాడుకొనేందుకు శరీరం విడుదల చేసే ప్రొటీన్‌ను సైటోకైన్లు అంటారు. ఇవి ఉన్నపళంగా ఎక్కువ సంఖ్యలో విడుదలైనప్పుడు ఇన్‌ఫ్లమేషన్‌ స్పందన అధికమవుతోంది. దీంతో ఆరోగ్యంగా ఉన్న కణాలపైనా ఇవి దాడి చేస్తున్నాయి. దీనినే సైటోకైన్‌ స్ట్రోమ్‌ అంటారు.

కరోనా వైరస్‌ నేరుగా టి-కణాలపై దాడి చేయదని సైటోకైన్లను అధికంగా విడుదల చేయడంతోనే టి కణాలు క్షీణించడం, తగ్గడం జరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. కొవిడ్‌-19 రోగులకు చికిత్సకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని అన్నారు. ‘కరోనా రోగుల్లో శ్వాస ఇబ్బందుల కన్నా టి-కణాలు, వాటి పనితీరుపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బాధితుల్లో త్వరగా, వేగంగా టి-కణాల సంఖ్యను గుర్తించాలి. కొవిడ్‌-19 రోగుల్లో వీటి సంఖ్య అసాధారణంగా తక్కువగా ఉంటోంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లో వీటి స్పందన అత్యంత కీలకం. యాంటీబాడీలు తయారవ్వని తొలిదశలో మరింత ముఖ్యం. ఆ సమయంలో టి-కణాలపై దృష్టిపెట్టాలి’ అని పరిశోధకుడు యాంగ్‌వెన్‌ చెన్‌ అన్నారు.

ఐదు రోజుల నుంచి 97 ఏళ్ల వయసు వారు 522 మందిపై అధ్యయనం చేయగా 76 శాతం మందిలో టి-కణాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. నాన్‌-ఐసీయూ వారితో పోలిస్తే ఐసీయూలోని రోగుల్లో టి-కణాల సంఖ్య తక్కువగా ఉంటోందన్నారు. ఈ కణాలను పునరుత్తేజం చేసేందుకు టొసిలిజుమాబ్‌ వంటి మందులు సమర్థంగా పనిచేస్తున్నాయని సూచించారు.

చదవండి: మద్యం తాగితే కరోనా పరారే అంటున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

చదవండి: 20 రోజులకు వైద్యురాలు ఇంటికి: ట్వీట్‌ చేసిన మోదీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని