India-Canada: ‘భారత్‌లో ఆ నగరాల్లో జాగ్రత్త..’: మరోసారి కెనడా కవ్వింపులు

India-Canada: భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కెనడా అడ్వైజరీ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, దౌత్య సిబ్బందిని తగ్గించిన నేపథ్యంలో ముంబయి, చండీగఢ్‌, బెంగళూరులో కాన్సులర్‌ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.

Updated : 20 Oct 2023 13:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు (India-Canada Diplomatic Row) మరింత ముదిరేలా కన్పిస్తున్నాయి. భారత్‌లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన కెనడా.. ఆ కాసేపటికే భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ (Canada Advisory) జారీ చేసి మరోసారి కవ్వింపులకు పాల్పడింది. మరోవైపు సిబ్బందిని తగ్గించిన నేపథ్యంలో ముంబయి, బెంగళూరు, చండీగఢ్‌లో అన్ని రకాల ఇన్‌-పర్సన్‌ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.

వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు..

‘‘ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. భారత్‌లో మీడియా, సామాజిక మాద్యమాల్లో కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కెనడా-వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరిగే అవకాశాలున్నాయి. కెనడియన్లపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చు. అందువల్ల దిల్లీ, ఎన్‌సీఆర్‌ (Delhi-NCR) ప్రాంతాల్లో కొత్త వ్యక్తులతో మీరు (కెనడియన్లు) జాగ్రత్తగా ఉండండి. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. బెంగళూరు (Bengaluru), చండీగఢ్‌ (Chandigarh), ముంబయి (Mumbai)ల్లోనూ అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఇక, సాధారణంగా పెద్ద నగరాల్లో విదేశీయులు, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కొందరు చోరీలకు పాల్పడుతుంటారు. అందుకే, రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండండి’’ అని కెనడా తమ అడ్వైజరీలో పేర్కొంది.

భారత్‌ నుంచి 41 మంది దౌత్యసిబ్బందిని వెనక్కి రప్పించాం: కెనడా అధికారిక ప్రకటన

ఆ నగరాల్లో వీసా, కాన్సులర్‌ సేవలు నిలిపివేత..

ఇక, దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకున్న దృష్ట్యా.. బెంగళూరు, ముంబయి, చండీగఢ్‌ నగరాల్లో అన్ని రకాల ఇన్‌-పర్సన్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు కెనడా తన అడ్వైజరీలో వెల్లడించింది. దీంతో ఈ నగరాల్లో వ్యక్తిగత వీసా (Visa), కాన్సులర్‌ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లోని కెనడియన్లు ఏదైనా అవసరమైతే దిల్లీలోని కెనడా హై కమిషన్‌ను సంప్రదించాలని సూచించింది.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో భారత అంతర్గత విషయాల్లో కెనడా దౌత్యవేత్తలు అతిగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ.. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమస్థాయిని పాటించాలని సూచించింది. ఈ క్రమంలోనే కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని న్యూదిల్లీ అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్‌ నుంచి 41 మంది దౌత్యసిబ్బందిని వెనక్కి రప్పించినట్లు కెనడా తాజాగా అధికారికంగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని