ఎంబీబీఎస్‌లో చేరిన పదేళ్లలోపు నెక్స్ట్‌లో ఉత్తీర్ణత

నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్స్ట్‌)కి సంబంధించిన నిబంధనలను విడుదల చేస్తూ జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

Published : 01 Jul 2023 06:56 IST

స్టెప్‌-1 పరీక్ష ఎన్నిసార్లైనా రాసే వెసులుబాటు
నిబంధనలు జారీచేసిన ఎన్‌ఎంసీ

ఈనాడు, దిల్లీ: నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్స్ట్‌)కి సంబంధించిన నిబంధనలను విడుదల చేస్తూ జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం ఈ పరీక్ష స్టెప్‌-1 (థియరీ), స్టెప్‌-2 (ప్రాక్టికల్‌) అన్న రెండు విభాగాలుగా జరుగుతుంది. స్టెప్‌-1లో ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. కంప్యూటర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ మోడ్‌లో పరీక్ష జరుగుతుంది. ఎంబీబీఎస్‌లోని సబ్జెక్టులను కవర్‌చేస్తూ ఈ పరీక్ష ఆరు పేపర్లతో ఉంటుంది. అందులో మెడిసిన్‌, సర్జరీ-అనుబంధ విభాగాలు, అబ్స్ట్‌ెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, ఓటోలారింగాలజీ, ఆప్తల్మాలజీ ఉంటాయి. ఎంబీబీఎస్‌ 3/చివరి సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులంతా స్టెప్‌-1 పరీక్ష రాయడానికి అర్హులే. దీనిని ఎన్నిసార్లైనా రాయవచ్చు. స్టెప్‌-1, 2 పరీక్షలు రెండూ ఎంబీబీఎస్‌లో చేరిన పదేళ్లలోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. స్టెప్‌-1లో స్కోర్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎన్నిసార్లైనా రాయవచ్చు. అయితే స్టెప్‌-2 పరీక్ష పూర్తిచేసిన తర్వాత ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. స్టెప్‌-2 పరీక్షలో ప్రాక్టికల్స్‌ పైన పేర్కొన్న ఆరు పేపర్లతోపాటు, ఆర్థోపెడిక్‌, పీఎంఆర్‌ (ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌)లు అదనంగా ఉంటాయి. స్టెప్‌-1లో ప్రతి పేపర్‌లో కనీసం 50% మార్కులు పొందితేనే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. ఒకసారి పరీక్ష రాసినప్పుడు రెండు పేపర్లు ఉత్తీర్ణులై, మిగిలిన నాలుగు పేపర్లు ఫెయిల్‌ అయితే ఆ నాలుగు పేపర్లను తర్వాత జరిగే నెక్స్ట్‌ పరీక్షలో రాసి అందులో కనీస మార్కులు సంపాదించుకుంటే పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు. దేశ, విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన విద్యార్థులంతా తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాలి. స్టెప్‌-1 పరీక్షలు ఏటా మే/నవంబరు నెలల్లో జరుగుతాయి. ఫలితాలు జూన్‌/డిసెంబరు మొదటివారంలో వెలువడతాయి. స్టెప్‌-2 రెగ్యులర్‌ పరీక్షలు జూన్‌/డిసెంబరు 3వ వారంలో జరుగుతాయి. ఫలితాలు అవే నెలల్లో నాలుగో వారంలో వెలువడతాయి. స్టెప్‌-2 సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబరు/మార్చి మొదటి వారంలో జరుగుతాయి. ఫలితాలు 3వ వారంలో విడుదల చేస్తారు. పీజీ అడ్మిషన్లు మే-జూన్‌లో (కౌన్సెలింగ్‌) ఉంటాయి. ఆ ప్రక్రియ జూన్‌ 30తో ముగుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు