స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులగణన లేదు

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జనాభా లెక్కల సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి తప్ప మిగిలిన కులాల లెక్కలను సేకరించలేదని కేంద్రం మంగళవారం లోక్‌సభకు తెలిపింది.

Published : 26 Jul 2023 04:41 IST

లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జనాభా లెక్కల సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి తప్ప మిగిలిన కులాల లెక్కలను సేకరించలేదని కేంద్రం మంగళవారం లోక్‌సభకు తెలిపింది. భవిష్యత్తులో చేపట్టే జనగణనలో కులాల వారీగా వివరాలను సేకరించాలని కొన్ని రాజకీయ పార్టీలు, మరికొన్ని సంస్థలు విజ్ఞప్తి చేశాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ వెల్లడించారు. రాజ్యాంగ (ఎస్సీ) ఆదేశం 1950 ప్రకారం షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ)లకు సంబంధించిన గణన మాత్రం చేపడుతున్నట్లు చెప్పారు.

కాందిశీకుల ఆస్తుల పరిష్కార పక్రియ మొదలైంది

దేశంలోని కాందిశీకుల ఆస్తుల వేలం ప్రక్రియ పూర్తి పారదర్శక విధానంలో మొదలు పెట్టినట్లు హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్ర మంగళవారం లోక్‌సభలో తెలిపారు. దేశవ్యాప్తంగా గల ఇటువంటి ఆస్తుల జాబితాను కూడా ప్రభుత్వం ప్రచురించిందన్నారు. మొత్తం రూ.లక్ష కోట్ల విలువైన 12,611 కాందిశీకుల ఆస్తులు ఉన్నాయని వివరించారు. వీటిలో 12,485 పాకిస్థాన్‌, 126 చైనా పౌరులకు సంబంధించినవని చెప్పారు. పాకిస్థాన్‌, చైనా పౌరసత్వాలు తీసుకుని ఆయా దేశాలకు వెళ్లిపోయిన వ్యక్తులకు చెందిన మన దేశంలోని ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా వ్యవహరిస్తున్నారు.

జులై 1 నాటికి మన జనాభా 139 కోట్లు

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నివేదిక ప్రకారం ఈ ఏడాది జులై 1 నాటికి మన దేశ అంచనా జనాభా 139,23,29,000 అని కేంద్రం మంగళవారం లోక్‌సభకు తెలిపింది. ఈ మేరకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ వెల్లడించారు.

ఓటీటీలూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శించాల్సిందే

ఓటీటీల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాల్లో పొగాకు ఉత్పత్తులు కనిపించే సమయంలో స్క్రీన్‌ అడుగు భాగంలో పొగాకు వ్యతిరేక హెచ్చరికను ప్రదర్శించడం తప్పనిసరని కేంద్రం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ ఓ రాతపూర్వక సమాధానంలో తెలిపారు.

కేంద్ర సాయుధ బలగాల్లో 80 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ

కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి విభాగాల్లో గత తొమ్మిది నెలల్లో 36,521 పోస్టులను భర్తీ చేసినట్లు కేంద్రం లోక్‌సభకు తెలిపింది. ఇంకా 79,960 ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిషిత్‌ ప్రమాణిక్‌ వెల్లడించారు.


8వ పే కమిషన్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదు: కేంద్రం

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌధరి రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగులు, పింఛనుదారులకు వచ్చే జీతాలు, పింఛన్లలో పడేకోతను భర్తీ చేసేందుకు కేంద్రం.. ఉద్యోగులకు డీఏ, డీఆర్‌ చెల్లిస్తుందని పేర్కొన్నారు. 2023 జనవరి నాటికి ఈ రేట్లు 42%కి చేరినట్లు చెప్పారు. అఖిల భారత ధరల సూచీని అనుసరించి ఆరు నెలల కోసం ఈ డీఏ, డీఆర్‌ రేట్లను సవరిస్తున్నట్లు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని