రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్‌ కోసం వేట

మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్‌ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది.

Updated : 06 May 2024 04:52 IST

ఈనాడు, బెంగళూరు: మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్‌ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. కేసులో రేవణ్ణను శనివారం అరెస్టు చేసిన సిట్‌ అధికారులు.. ఆదివారం రాత్రి ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కేసు తీవ్రత దృష్ట్యా ఆయన్ను లోతుగా విచారించాలని అధికారుల విన్నపాన్ని న్యాయమూర్తి అంగీకరించారు. కిడ్నాప్‌ అయిన బాధితురాలిని తానెన్నడూ చూడలేదని విచారణలో రేవణ్ణ చెప్పినట్లు పోలీసువర్గాల సమాచారం. బెంగళూరు, హొళనరసీపురల్లోని తన ఇంట్లో ఎందరో పని చేస్తుంటారని, వారిని గుర్తించుకోవటం సాధ్యం కాదని తెలిపినట్లు తెలుస్తోంది. రేవణ్ణ పిలిస్తేనే మహిళను రహస్య ప్రాంతానికి తరలించారన్న ప్రచారాన్ని పోలీసులు ఆయన వద్ద ప్రస్తావించగా.. ఆ పేరు తనకొక్కడికే ఉందా? ఇంకెవరైనా ఉండొచ్చు కదా? అంటూ ఎదురుప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు అపహరణకు గురైన మహిళనుంచీ స్పష్టమైన సమాచారం రాలేదని తెలుస్తోంది. తనను ఎవరూ అపహరించలేదని ఒకసారి, తనను ఎవరో తీసుకెళ్లారని ఓసారి ఆమె పేర్కొనడంతో తగిన విశ్రాంతినిచ్చి విచారించాలని అధికారులు నిర్ణయించారు.

ఇది రాజకీయ కుట్ర..

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి కుట్రను ఎన్నడూ చూడలేదని హెచ్‌.డి.రేవణ్ణ పేర్కొన్నారు. ఆరోగ్య పరీక్షలకు వెళుతున్నప్పుడు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్‌ 28న ఓ కేసు నమోదు చేశారని, అందులో ఎలాంటి ఆధారాలు దొరకక ఈనెల 2న మరో కేసు పెట్టి అరెస్టు చేశారని వివరించారు. అక్రమ కేసు నుంచి బయటపడతానని పేర్కొన్నారు. ఏ తప్పూ చేయని తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ న్యాయమూర్తి ముందు రేవణ్ణ కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికే బ్లూకార్నర్‌ నోటీసులు అందుకున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఏ క్షణంలోనైనా బెంగళూరుకు రానున్నారు. విమానాశ్రయానికి రాగానే అరెస్టు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మూడు నోటీసులకు బదులివ్వని ప్రజ్వల్‌కు నాలుగోసారి నోటీసులిచ్చారు. మరోవైపు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ఇప్పటికే తొమ్మిది మంది మహిళలు ఫిర్యాదుచేశారు. వీరి కోసం హెల్ప్‌లైన్‌ నంబరును ఏర్పాటుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని