చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ

చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అన్నారు.

Published : 06 May 2024 06:27 IST

కాఠ్‌మాండూ: చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అన్నారు. ‘బాలల నేర న్యాయవ్యవస్థ’ అనే అంశంపై నేపాల్‌లో ఏర్పాటుచేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. అందులో ప్రసంగిస్తూ.. ‘‘పిల్లలతో ఉపాధ్యాయుల ప్రవర్తనా విధానం వారి మనసుపై లోతైన ప్రభావం చూపుతుంది. అది వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను అయిదో తరగతి చదువుతున్న రోజుల్లో జరిగిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. క్రాఫ్ట్‌ అసైన్‌మెంట్‌కు కావాల్సిన సరైన సూదులను నేను పాఠశాలకు తీసుకెళ్లలేదు. విషయం తెలుసుకొని మా టీచర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెత్తంతో నా చేతిపై బలంగా కొట్టారు. ఆ దెబ్బలకు కుడి చేయి కందిపోయింది. అవమానంతో 10 రోజుల వరకు చేతిని ఎవరికీ చూపించలేదు. కొంతకాలం తర్వాత భౌతిక గాయం నయమైంది. కానీ ఆ సంఘటన నాపై ఎంతో ప్రభావం చూపింది. ఇప్పటికీ ఏదైనా పని చేస్తున్నప్పుడు గుర్తుకువస్తుంటుంది’’ అని పేర్కొన్నారు. చట్టపరమైన సంఘర్షణల్లో చిక్కుకున్న బాలల బలహీనతలు, ప్రత్యేక అవసరాలను గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఠాల ద్వారా చిన్నారులు నేర కార్యకలాపాల్లోకి బలవంతంగా దిగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దృష్టిలోపం ఉన్న పిల్లలతో వ్యవస్థీకృత నేర బృందాలు ఎలా భిక్షాటన చేయిస్తున్నాయో చూస్తూనే ఉన్నామని.. యుక్తవయసువారికి, దివ్యాంగులకు కూడా ఈ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. నేపాల్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిషోవంభర్‌ ప్రసాద్‌ శ్రేష్ఠ ఆహ్వానం మేరకు సీజేఐ గత శుక్రవారం ఆ దేశ పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల సర్వోన్నత న్యాయస్థానాల మధ్య పరస్పర సహకారంపై ఆయనతో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని