భారత్‌, జపాన్‌ సహజ మిత్రులు

భారత దేశ అభివృద్ధి పథంలో జపాన్‌ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గౌతమ బుద్ధుని బోధనలతో ప్రభావితమైన ఈ రెండు దేశాలు సుదీర్ఘ కాలంగా అన్ని రంగాల్లో దృఢమైన స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయని, సహజ మిత్రులని అభివర్ణించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం టోక్యో చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారత సంతతి ప్రజలనుద్దేశించి

Published : 24 May 2022 05:10 IST

రెండు దేశాల మధ్య దృఢమైన  చారిత్రక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు
టోక్యోలో ప్రవాస భారతీయులతో భేటీలో ప్రధాని మోదీ వెల్లడి

టోక్యో: భారత దేశ అభివృద్ధి పథంలో జపాన్‌ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గౌతమ బుద్ధుని బోధనలతో ప్రభావితమైన ఈ రెండు దేశాలు సుదీర్ఘ కాలంగా అన్ని రంగాల్లో దృఢమైన స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయని, సహజ మిత్రులని అభివర్ణించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం టోక్యో చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారత సంతతి ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వస్తూత్పత్తి సామర్థ్యం పెంపులో జపాన్‌ ప్రధాన భాగస్వామని తెలిపారు. ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు, దిల్లీ-ముంబయి పారిశ్రామిక నడవా, సరకు రవాణా నడవాలు రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర సహకారానికి నిలువెత్తు నిదర్శనాలని పేర్కొన్నారు. బౌద్ధ మతం వ్యాప్తి చెందిన కాలం నుంచి జపాన్‌తో భారత్‌కు సత్సంబంధాలున్నాయని గుర్తు చేశారు.  గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా సరఫరా వ్యవస్థ దెబ్బతిందని గుర్తు చేస్తూ...భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించడానికి ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ సరైన దారిని చూపుతుందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌... సుస్థిరమైన, నిలకడైన ప్రపంచ సరఫరా వ్యవస్థకు అవసరమైన అతిపెద్ద పెట్టుబడుల వాతావరణాన్ని సృష్టిస్తుందని వివరించారు. ఎంత పెద్ద సమస్యకైనా భారత్‌ వద్ద పరిష్కారం ఉంటుందని తెలిపారు. ‘‘ప్రతి భారతీయుడు జపాన్‌ను తప్పనిసరిగా సందర్శించాలని చాలా కాలం క్రితం స్వామివివేకానంద చెప్పారు. ప్రతి జపనీయుడు వారి జీవితకాలంలో ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాలని నేను చెబుతున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.

బాలుడికి ప్రశంస

టోక్యోలో తనకు ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. టోక్యోలో హోటల్‌కు చేరుకున్న సమయంలో అక్కడ స్వాగత ప్లకార్డులు, పెయింటింగ్స్‌తో వేచి ఉన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులను ప్రధాని మోదీ పలకరించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి ధారళంగా హిందీలో మాట్లాడడంతో  ముగ్ధులయ్యారు. ఆ బాలుడు గీసిన త్రివర్ణ చిత్రంతో పాటు పలువురి చిన్నారుల పెయింటింగ్స్‌పైనా ప్రధాని ఆటోగ్రాఫ్‌ చేశారు.

జపాన్‌ పత్రికకు వ్యాసం

పర్యటన సందర్భంగా ‘యోమియోరి షింబన్‌’ పత్రికకు రాసిన సంపాదకీయ వ్యాసంలో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చిరకాల సంబంధాలను ప్రధాని మోదీ వివరించారు.   


నేడు క్వాడ్‌ సదస్సు

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడమే లక్ష్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకునేందుకు చతుర్భుజ కూటమి- ‘క్వాడ్‌’ సిద్ధమైంది! కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల నేతలు టోక్యోలో మంగళవారం సమావేశం కానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా తలెత్తుతున్న సమస్యలపై వారు కూలంకషంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని