నదిలో పడిన సైనిక వాహనం

సైనికులు ప్రయాణిస్తున్న వాహనం లద్దాఖ్‌లో పెను ప్రమాదానికి గురైంది. ఏడుగురు మృతి చెందగా 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో లద్దాఖ్‌లోని టుర్టుక్‌ సెక్టార్‌లో ఈ దుర్ఘటన జరిగింది. సైనిక వాహనం

Published : 28 May 2022 05:18 IST

ఏడుగురు జవాన్ల మృతి
19 మందికి గాయాలు
లద్దాఖ్‌లో ఘోర ప్రమాదం

దిల్లీ: సైనికులు ప్రయాణిస్తున్న వాహనం లద్దాఖ్‌లో పెను ప్రమాదానికి గురైంది. ఏడుగురు మృతి చెందగా 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో లద్దాఖ్‌లోని టుర్టుక్‌ సెక్టార్‌లో ఈ దుర్ఘటన జరిగింది. సైనిక వాహనం ఘాట్‌ రోడ్డు మీద నుంచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపోయి షియోక్‌ నదిలో పడిపోయింది. రోడ్డు నుంచి దాదాపు 60 అడుగుల లోతుకు వాహనం దొర్లిపోయిందని సైనికాధికారులు తెలిపారు. ఆ సమయంలో మొత్తం 26 మంది వాహనంలో ఉన్నారు. వారంతా పార్తాపుర్‌ శిబిరం నుంచి సరిహద్దుకు సమీపంలోని హనీఫ్‌ ప్రాంతానికి వెళ్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ప్రమాద స్థలానికి వెళ్లి క్షతగాత్రులందరినీ తొలుత పార్తాపుర్‌లోని 403 ఫీల్డ్‌ ఆసుపత్రికి తరలించాయి. ఏడుగురు సైనికులు మృతి చెందినట్లు అక్కడ ప్రకటించారు. గాయపడిన 19 మందిని మెరుగైన వైద్యం కోసం హరియాణాలోని పంచకుల జిల్లా చండీమందిర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

సైనికుల మృతిపై రాష్ట్రపతి కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్‌ చేశారు. బాధితులందరికీ తగిన సహాయం చేస్తామన్నారు. ప్రమాద ఘటన గురించి రాజ్‌నాథ్‌ సింగ్‌కు సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌పాండే వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని