రాజకీయ కారణాలతో మోదీని కొందరు అపార్థం చేసుకుంటున్నారు

రాజకీయ కారణాలతో కొందరు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను అపార్థం చేసుకుంటున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కానీ ప్రధానికి దేశమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడి ఆకాశవాణి భవన్‌లో

Published : 24 Sep 2022 05:14 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: రాజకీయ కారణాలతో కొందరు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను అపార్థం చేసుకుంటున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కానీ ప్రధానికి దేశమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడి ఆకాశవాణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌, కేరళ గవర్నర్‌ ఆరీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌లతో కలిసి మోదీ 2019 మే నుంచి 2020 మే మధ్యకాలంలో చేసిన 86 ఎంపిక చేసిన ప్రసంగాలతో ముద్రించిన ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌’ పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం ప్రసంగించారు. ప్రధాని దార్శనికత, సబ్‌కా సాథ్‌ నినాదం ముఖ్యలక్ష్యం గురించి ఈ పుస్తకం స్పష్టం చేస్తుందని తెలిపారు. ‘‘పనిచేయడం, సంస్కరించడం, మార్పుచెందడం (పెర్ఫార్మ్‌, రీఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌) మోదీ పఠించే తారకమత్రం. మనం దీనికి కట్టుబడితే వచ్చే 25 ఏళ్లలో నవభారతాన్ని సృష్టించడం ఖాయం. ఈ లక్ష్యాన్ని చేరుకొనేంతవరకూ మోదీ ప్రధానిగా దేశానికి మార్గనిర్దేశం చేయడాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నా. కొన్ని వర్గాలకు మోదీ వైఖరి, విధానాలపట్ల కొన్ని అనుమానాలున్నాయి. భారత్‌ వేగంగా ఉన్నతశిఖరాలను అధిరోహిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనమీదున్న అనుమానాలన్నీ పటాపంచలవుతూపోతాయి. మోదీ కూడా తరచుగా అన్ని పక్షాల రాజకీయ నాయకులతో భేటీ అవ్వాలి. ఆయన విధానాలపై ఉన్న అపార్థాలు తొలగిపోవడానికి అది సహాయపడుతుంది’’ అని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ‘‘మోదీ దేశ ఉన్నతి కోసం తపస్సు చేస్తున్నారు. నవభారత నిర్మాణం కోసం ఆయన చేస్తున్న తపస్సు ప్రజల శక్తిని మరింత పెంపొందిస్తుంది’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని