Justice Chandrachud: తండ్రికి తగ్గ వారసుడు
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం
రెండేళ్లపాటు పదవిలో..
4 దశాబ్దాల క్రితం సీజేఐగా పనిచేసిన ఆయన తండ్రి
ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయిస్తారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో లాంఛనంగా ఈ కార్యక్రమం సాగనుంది. 44 ఏళ్లక్రితం తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేస్తే, ఇప్పుడు తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించే ఘట్టం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి చోటుచేసుకుంటోంది. కొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో సరిగ్గా రెండేళ్లు కొనసాగుతారు.
ఏడేళ్లు సీజేఐగా రికార్డు సృష్టించిన జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్
44 ఏళ్ల క్రితం జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల అయిదు నెలలపాటు ఆ పదవిలో కొనసాగి సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ స్థానానికి చేరుకుంటున్న జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10వరకు సీజేఐగా కొనసాగుతారు. 1959 నవంబరు 11న బాంబేలో జన్మించిన జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు 2000 మార్చి 29న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. అంతకుముందు 1998 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంతవరకూ అడిషినల్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్‌లో 1983లో స్కాలర్‌షిప్ మీద ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ చేశారు. అక్కడ అత్యధికమార్కులు సాధించి జోసెఫ్ హెచ్.బీలె ప్రైజ్ దక్కించుకున్నారు. జ్యుడిషియల్‌సైన్సెస్‌లో డాక్టరేట్ పూర్తిచేసే వరకు(1986) అదే యూనివర్సిటీలో ఉన్నారు. అంతకుముందు దిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనమిక్స్‌లో బీఏ, దిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు. ముంబయి యూనివర్సిటీ, అమెరికాలోని ఒక్లహామా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో సందర్శక ఆచార్యుడు(విజిటింగ్ ప్రొఫెసర్)గానూ సేవలందించారు. మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. ఆయన న్యాయవాదిగా ఉన్నప్పటి నుంచి సామాజిక అంశాలపై సూక్ష్మదృష్టిసారించిన వ్యక్తిగా పేరుంది.
మహిళలు, అల్పసంఖ్యాకుల పక్షాన వాదనలు
హెచ్‌ఐవీ-ఎయిడ్స్ సోకిన కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఓ కార్మికుడి తరఫున 1997లో ఆయన వాదించి బాధితుడికి న్యాయం చేశారు. వెట్టిచాకిరిలో కూరుకుపోయిన మహిళలు, మత, భాషాపరమైన అల్పసంఖ్యాకుల హక్కుల కోసమూ ఆయన న్యాయస్థానాల్లో వాదనలు వినిపించి బాధితుల పక్షాన నిలిచారు. 38 ఏళ్ల చిన్నవయస్సులోనే 1998లో సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. తర్వాత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులై 2000 మార్చి 29న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంతవరకూ ఆ పదవిలో కొనసాగారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 734 తీర్పుల్లో భాగస్వాములయ్యారు. అందులో 520 దాకా ఆయన సొంతంగా రాశారు. ఆయన సుప్రీంకోర్టు ఈ-కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే కోర్టు విచారణలను ప్రత్యక్షప్రసారం చేసే మౌలికవసతులను కల్పించారు.
స్వాగతిస్తున్న సవాళ్లు
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ చంద్రచూడ్ ముందు పలు సవాళ్లు ఉన్నాయి. న్యాయమూర్తుల ఖాళీల భర్తీ, న్యాయవ్యవస్థలో మౌలికసదుపాయాల కల్పన, పెండింగ్ కేసులను పరిష్కరించడం, వేగంగా న్యాయం అందించడం అందులో ప్రధానమైనవి. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, ఎలక్టోరల్ బాండ్ స్కీం కేసుల్లో ఎలా వ్యవహరిస్తారోనన్న ఉత్కంఠ న్యాయనిపుణుల్లో వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: షూటింగ్లో మరో రెండు స్వర్ణాలు.. టెన్నిస్‌లో రజతం
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు