శ్రీహరికోటలో తొలి ప్రైవేటు ప్రయోగ వేదిక

భారతీయ అంతరిక్ష రంగం మరో కీలక అడుగు వేసింది.

Published : 29 Nov 2022 04:34 IST

అగ్నికుల్‌ మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆవిష్కరణ

ఈనాడు, బెంగళూరు: భారతీయ అంతరిక్ష రంగం మరో కీలక అడుగు వేసింది. ఇస్రో ఉపగ్రహాల ప్రయోగ క్షేత్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (ఎస్‌డీఎస్‌సీ- శ్రీహరికోట) ప్రాంగణంలో చెన్నైకి చెందిన అంతరిక్ష అంకుర సంస్థ అగ్నికుల్‌ కాస్మోస్‌.. అగ్నికుల్‌ మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఈనెల 25న ఈ కేంద్రాలను ఆవిష్కరించినట్లు అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ సోమవారం వెల్లడించింది. ఇకపై భారతీయ ఉపగ్రహాలు మరో ప్రయోగ కేంద్రం ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణం చేయొచ్చని ఇస్రో ప్రకటించింది. దేశంలో తొలి ప్రైవేటు లాంచ్‌ప్యాడ్‌ ఏర్పాటుపై ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అగ్నికుల్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనాథ్‌ రవిచంద్రన్‌ మాట్లాడుతూ ఇస్రో, అంతరిక్ష శాఖ, ఇన్‌-స్పేస్‌లు అందించిన సహకారం, సదుపాయాలతోనే అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలు చక్కగా రాణించగలవన్నారు. ఇస్రో ఆపరేషన్‌ బృందాల నుంచి లిక్విడ్‌ స్టేజ్‌ నియంత్రిత వ్యవస్థలు, ఉపగ్రహాల పర్యవేక్షణ, భద్రత, ఇస్రో మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి డేటా సేకరించే వెసులుబాటు ఈ కేంద్రానికి ఉందన్నారు. ఐటీ మద్రాస్‌ ఉద్దీపనతో అగ్నికుల్‌ సంస్థ ఏర్పాటైంది. ఈ కేంద్రం నుంచి తొలి ప్రయోగంగా 100 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లే రెండు దశల వాహకనౌక అగ్నిబాన్‌ను ప్రయోగిస్తామని అగ్నికుల్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని