సంక్షిప్త వార్తలు(3)

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత అయిదేళ్లలో చేసిన విదేశీ పర్యటనలకు రూ.239.62 కోట్లు వ్యయమైనట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ తెలిపారు.

Updated : 09 Dec 2022 06:01 IST

ప్రధాని విదేశీ పర్యటనల వ్యయం రూ.239 కోట్లు

ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత అయిదేళ్లలో చేసిన విదేశీ పర్యటనలకు రూ.239.62 కోట్లు వ్యయమైనట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ తెలిపారు. సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు.


2019 తరన్‌తారన్‌ బాంబుపేలుళ్ల సూత్రధారి అరెస్టు

ఆస్ట్రియా నుంచి రప్పించిన ఎన్‌ఐఏ

దిల్లీ: పంజాబ్‌లోని తరన్‌తారన్‌లో 2019 నాటి బాంబు పేలుళ్ల కేసు ప్రదాన సూత్రధారి బిక్రమ్‌జిత్‌ సింగ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం అరెస్టుచేసింది. ఆస్ట్రియా నుంచి నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద దిల్లీ విమానాశ్రయానికి రాగానే సింగ్‌ను అరెస్టుచేసినట్లు ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు. బిక్కర్‌ పంజ్వార్‌, బిక్కర్‌బాబా అనే మారుపేర్లున్న బిక్రమ్‌జిత్‌ సింగ్‌ను ఇంటర్‌పోల్‌ సహకారంతో భారత్‌కు రప్పించారు. పంజాబ్‌లో ఉగ్రదాడులు చేసేందుకు బిక్రమ్‌ ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటుచేశాడని, అతడిని రప్పించేందుకు ఎన్‌ఐఏ ఓ బృందాన్ని ఆస్ట్రియా పంపిందని ఎన్‌ఐఏ ప్రతినిధి చెప్పారు. బిక్రమ్‌ కొందరికి ఉగ్రవాదశిక్షణ ఇవ్వడంతో పాటు ఐఈడీలు తయారుచేయడం, వాటిని ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చాడన్నారు. 2019 సెప్టెంబరు 4న తరన్‌తారన్‌లోని పండోరి గోలా గ్రామ శివార్లలో శక్తిమంతమైన బాంబు పేలి ఇద్దరు మరణించారు. గోతిలో దాచిపెట్టిన బాంబులను తీస్తుండగా అవి పేలాయి. తరన్‌తారన్‌లోని మురాద్‌పురాలో ఉన్న ఓ డేరాపై దాడి చేసేందుకు బిక్రమ్‌ కుట్ర పన్నాడు. బాంబులను తవ్వి తీస్తున్నవారిలో హర్జీత్‌, గుర్జంత్‌, బిక్రమ్‌, హర్‌ప్రీత్‌ ఉన్నారు. ఈ పేలుడులో తానూ చనిపోయినట్లు నాటకమాడి.. బిక్రమ్‌ ఆస్ట్రియాకు పారిపోయాడు.


సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలో నేరుగా నియమకాలు!

పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు

దిల్లీ: సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌ లేదా డీఎస్పీ స్థాయిలో పోస్టులకు నేరుగా నియామకాలు చేసే వెసులుబాటు ఉండాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఈ మేరకు ఒక నివేదికను గురువారం రాజ్యసభకు సమర్పించింది. సీబీఐలో 1,025 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అందులో 66 కేసులకు ఐదేళ్ల కిందటివని తెలిపింది. సరిపడా మానవ వనరులు ఉంటే ఈ జాప్యం తగ్గుతుందని వివరించింది. సీబీఐలో ఎస్సై స్థాయికి పైబడిన పోస్టులకు నేరుగా నియామకాలు చేపట్టే అవకాశం లేదని పేర్కొంది. ఇన్‌స్పెక్టర్‌, డీఎస్పీ, ఏఎస్పీ హోదాల్లో నియామకాలను పదోన్నతులు, డిప్యూటేషన్‌ వంటి మార్గాల్లో భర్తీ చేస్తున్నారని తెలిపింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు