బాణలిలో వండేస్తూ... లాభాలు అందుకుంటూ!

అరవయ్యో పడిలోకి వచ్చాక విశ్రాంతి కోరుకునేవారే ఎక్కువ. కానీ ఈ అక్కాచెల్లెళ్లు మాత్రం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. సంప్రదాయ పిండివంటలను అందిస్తూ సినీతారలనీ ఆకర్షించారు. విదేశాలకీ ఎగుమతి చేస్తున్నారు ఉషా పెనుమత్స, దాట్ల సీతా రాజేశ్వరి.

Published : 26 Apr 2024 02:06 IST

అరవయ్యో పడిలోకి వచ్చాక విశ్రాంతి కోరుకునేవారే ఎక్కువ. కానీ ఈ అక్కాచెల్లెళ్లు మాత్రం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. సంప్రదాయ పిండివంటలను అందిస్తూ సినీతారలనీ ఆకర్షించారు. విదేశాలకీ ఎగుమతి చేస్తున్నారు ఉషా పెనుమత్స, దాట్ల సీతా రాజేశ్వరి. ఆ ప్రయాణాన్ని చెల్లెలు ఉష మనతో పంచుకున్నారిలా...

మాది పశ్చిమగోదావరి జిల్లాలోని దర్భారేవు. ఉమ్మడి కుటుంబం. ఇద్దరం ఎనిమిది వరకూ చదువుకున్నాం. 13 ఏళ్లకే ఎన్నో వంటలు చేసేవాళ్లం. అమ్మ దగ్గర... పెళ్లయ్యాక అత్తారింట్లో రకరకాల వంటకాలు నేర్చుకున్నాం. కొత్తగా ప్రయత్నించి, చుట్టుపక్కల వాళ్లకీ, బంధువులకీ పంచడం... వాళ్లు బాగున్నాయి అంటోంటే ఉత్సాహంగా మరిన్ని చేసేవాళ్లం. అప్పటివరకూ సరదాగానే చేసేవాళ్లం. వ్యాపార ఆలోచన ఎప్పుడూ లేదు. దానికి బీజం పడింది కొవిడ్‌లో! ఆ సమయంలో ఏం తోచక వంటకాలు చేసి, తెలిసినవారికి పంపేవాళ్లం. మా సంప్రదాయ వంటలు వాళ్లకి బాగా నచ్చేవి. కొందరు అడిగి చేయించుకోవడానికి మొహమాటపడితే... మరికొందరు డబ్బులిస్తాం చేసివ్వగలరా అని అడిగేవారు. మాకూ ప్రయత్నించాలి అనిపించింది.

ఆలోచన విన్నాక కొంతమంది 60 ఏళ్ల వయసులో వ్యాపారం అవసరమా అంటే... కొందరు మాత్రం ఏదైనా చేయడానికి వయసుతో సంబంధమేంటి ప్రయత్నించండి అని ప్రోత్సహించారు. సరేనని ప్రారంభిస్తే... కొవిడ్‌లో ముడిసరకుకు ఇబ్బంది అయ్యేది. పనివాళ్లూ దొరికేవారు కాదు. 5 రకాల పిండివంటలతో మొదలుపెట్టాం. నెమ్మదిగా ఆర్డర్లు పెరిగాయి. దీంతో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని తయారీ ప్రారంభించాం. అప్పుడు మా బంధువొకరు ‘క్లౌడ్‌ కిచెన్‌’గా మార్చమని సలహానిచ్చారు. అలా 2021 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ‘బాణలి’ మొదలైంది. బాణలి అంటే వాడుకలో కడాయి అని అర్థం. వంటకాలకు సంబంధించిన వ్యాపారం కదా... దానికి అనుబంధంగా ఉండాలని ఈ పేరు ఎంచుకున్నాం.

స్వీట్లు, స్నాక్స్‌, కారప్పొడులు, పచ్చళ్లు... ఇలా 80కిపైగా వంటలు చేస్తున్నాం. తోటకూర పకోడి, కంద కారప్పూస, ఆకుపకోడి, ఆవిరి బూరెలు, తీపిగారెలు... లాంటి ఆనాటి కాలం వంటలకే ఎక్కువ ప్రాధాన్యం. నోటి ప్రచారం ద్వారానే మాకు కస్టమర్లు పెరిగారు. ఈకాలానికి తగ్గట్టుగా గిఫ్ట్‌ హ్యాంపర్లనూ తయారుచేశాం. ఓసారి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా సినీ నిర్మాత శోభు యార్లగడ్డకి హ్యాంపర్‌ వెళ్లింది. ఆయన ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావు గారి అమ్మాయి నుంచి సంక్రాంతికి ఆర్డర్‌ వచ్చింది. అలా ఒక్కొక్కరూ పెరిగారు. హీరో ప్రభాస్‌, మంచు లక్ష్మి, రాజమౌళి... ఇలా ఎంతోమంది సినీ పెద్దల నుంచీ ఆర్డర్లు వస్తుంటాయి. యూఎస్‌ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, దుబాయి సహా ఇతర దేశాలకూ పంపిస్తున్నాం. వ్యాపారం... అదీ ఈ వయసులో అంత సులువేమీ కాదు. మాకూ ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా నిలదొక్కుకొని ముందుకు సాగుతున్నాం. రూ.కోటిన్నర టర్నోవర్‌ సాధించడమే కాదు, 15 మందికి ఉపాధినిస్తున్నాం. దీన్నింకా విస్తరించడం మా ముందున్న లక్ష్యం.

మంత్రి భాస్కర్‌, ఈటీవీ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్