చదరంగ యువరాజుకు ఘన స్వాగతం

సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది.

Updated : 26 Apr 2024 08:56 IST

చెన్నై చేరుకున్న గుకేశ్‌
చెన్నై

మయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. వందలాది విద్యార్థులు అక్కడ వరుస కట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆ తల్లి ఆత్రుతతో ఉంది. ఆ అందరి ఎదురు చూపులు ఆ వీరుడి కోసమే. ఆ సమయం రానే వచ్చింది. భారత చదరంగ సంచలనం దొమ్మరాజు గుకేశ్‌ ఆ విమానాశ్రయంలో కనబడగానే కేరింతలు మిన్నంటాయి. చప్పట్లతో పరిసరాలు మార్మోగాయి. తల్లి పద్మను చూడగానే ఆ ఛాంపియన్‌ ముఖం నవ్వుతో వెలిగిపోయింది. వెంటనే వెళ్లి హత్తుకున్నాడు. అతనితో పాటు వచ్చిన తండ్రి రజనీకాంత్‌ కూడా ఆనందంలో మునిగిపోయాడు. ఇలా.. క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచి ప్రపంచ టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర లిఖించిన 17 ఏళ్ల గుకేశ్‌కు ఘనస్వాగతం లభించింది. సోమవారం కెనడాలోని టొరంటోలో ప్రకంపనలు సృష్టించిన గుకేశ్‌ స్వదేశానికి చేరుకున్నాడు. స్వాగతం పలికేందుకు అంత రాత్రిలోనూ అతను చదువుకునే వేలమ్మాల్‌ విద్యాలయ విద్యార్థులు తరలిరావడం విశేషం. ‘‘ఇలా స్వదేశానికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదెంతో ప్రత్యేకమైన ఘనత. టోర్నీ (క్యాండిడేట్స్‌) ఆరంభం నుంచి మంచి లయతోనే ఉన్నా. గెలుస్తాననే ఆత్మవిశ్వాసంతో సాగా. అదృష్టం కూడా నా వైపు నిలిచింది. ఎంతో మంది చెస్‌ను ఆస్వాదిస్తుంటే ఆనందంగా ఉంది. ఈ టోర్నీ గెలవడంలో సాయపడ్డ నా తల్లిదండ్రులు, కోచ్‌, కుటుంబం, నా పాఠశాల, తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని గుకేశ్‌ తెలిపాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాణ్నే కాదని గుకేశ్‌ అన్నాడు. వెస్ట్‌బ్రిడ్జ్‌ ఆనంద్‌ చెస్‌ అకాడమీలో శిక్షణ పొందిన గుకేశ్‌.. ఆనంద్‌ తర్వాత క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ‘‘నాతో పాటు ప్రతి ఒక్కరికీ విషీ సర్‌ స్ఫూర్తి. నా కెరీర్‌లో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన అకాడమీ నుంచి ఎంతో లబ్ధి పొందా. ఆయనకు రుణపడి ఉంటా. ఆయన లేకపోతే ఈ స్థాయి కాదు కదా దరిదాపుల్లోకి కూడా వచ్చేవాణ్ని కాదు’’ అని అతను పేర్కొన్నాడు. ప్రపంచ టైటిల్‌ కోసం ఈ ఏడాది చివర్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)తో గుకేశ్‌ తలపడనున్నాడు. ‘‘డింగ్‌తో పోరుకు ముందు నా సన్నాహకం సాగే తీరు, సరైన మానసిక దృక్పథంతో ఉండటమే సవాలు. నాపై చాలా అంచనాలున్నాయి. నాపై నాకు నమ్మకముంది. ఇదే వ్యూహంతో సాగుతా. మంచి ఫలితమే వస్తుందని ఆశిస్తున్నా’’ అని గుకేశ్‌ పేర్కొన్నాడు.

అందుకే ధోనీని ఆరాధిస్తా

తీవ్రమైన ఒత్తిడిని కూడా గొప్పగా ఎదుర్కొనే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, టెన్నిస్‌ దిగ్గజం జకోవిచ్‌లను తాను ఆరాధిస్తానని గుకేశ్‌ చెప్పాడు. ‘‘తీవ్రమైన ఒత్తిడిని కూడా ధోని, జకోవిచ్‌ ఎదుర్కొనే తీరు గొప్పగా ఉంటుంది. వాళ్లు పెద్ద ఆటగాళ్లు. ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. అందుకే వీళ్లకు ఆకర్షితుడినయ్యా. ఇటీవల ఎక్కువగా క్రికెట్‌ను అనుసరించడం లేదు. కానీ అన్ని క్రీడలను, ముఖ్యంగా టెన్నిస్‌ను ఆస్వాదిస్తా. ఆటలతో ప్రేమలో పడ్డా’’ అని అతను తెలిపాడు. ఆధునిక చెస్‌ దిగ్గజంగా ఎదిగిన కార్ల్‌సన్‌ నుంచి ఎంతో నేర్చుకోవచ్చని గుకేశ్‌ అన్నాడు. ‘‘కార్ల్‌సన్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. కేవలం చెస్‌ పరంగానే కాదు మానసిక దృక్పథం గురించి కూడా నేర్చుకోవచ్చు. ప్రపంచంలో ఏ క్రీడలో చూసినా సరే అత్యుత్తమ మానసిక దృక్పథాన్ని కలిగి ఉన్నది మాత్రం కార్ల్‌సనే. ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతారు. కానీ అనుభవంతో దాన్ని అధిగమించడం నేర్చుకుంటారు. పరిణతి, ప్రాక్టీస్‌తో మెరుగవుతారు’’ అని అతను పేర్కొన్నాడు. టొరంటోలో భారత భూకంపంగా గుకేశ్‌ను చెస్‌ దిగ్గజం కాస్పరోవ్‌ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ‘‘నా హీరోల్లో కాస్పరోవ్‌ ఒకరు. ఆల్‌టైమ్‌ అత్యుత్తమ చెస్‌ ఆటగాళ్లలో ఆయన ఒకరు. ఆయన నుంచి ఇలాంటి ప్రశంస పొందడం నాకెంతో ముఖ్యమైంది. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం త్వరలోనే ప్రాక్టీస్‌ మొదలెడతా. దీన్ని ఆస్వాదిస్తాననే అనుకుంటున్నా’’ అని గుకేశ్‌ పేర్కొన్నాడు.


ప్రపంచ చెస్‌ పోరు ఇక్కడే నిర్వహించాలని..  

యువ కెరటం దొమ్మరాజు గుకేశ్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ మధ్య జరగబోయే ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ ఆతిథ్యానికి భారత్‌ ప్రయత్నాలు చేస్తోంది. అఖిల భారత చెస్‌ సమాఖ్య కార్యదర్శి దేవ్‌ పటేల్‌ గురువారం ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ ఏడాది మధ్యలో జరిగే ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ తేదీలు, వేదిక ఇంకా ఖరారు కాలేదు. ‘‘ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఫిడేతో చర్చలు మొదలుపెట్టాం. ఈ టోర్నీని నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాం. భారత్‌లో ఈ ఈవెంట్‌ జరగడం ద్వారా చెస్‌కు మరింత ప్రాచుర్యం తీసుకు రావడం మా ఉద్దేశం’’ అని ఇటీవలే కార్యదర్శిగా ఎంపికైన దేవ్‌ పటేల్‌ తెలిపాడు. ఇటీవల టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన గుకేశ్‌.. లిరెన్‌తో ప్రపంచ టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది చెస్‌ ప్రపంచకప్‌ చెన్నైలోనే జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని