బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?

నంద్యాల జిల్లా డోన్‌ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

Updated : 26 Apr 2024 06:56 IST

ప్రశ్నించిన పాపానికి వార్డు సభ్యుడి నిర్బంధం
వృద్ధుడనీ చూడకుండా 2 రోజులు ఠాణాలోనే

ఈనాడు, కర్నూలు: నంద్యాల జిల్లా డోన్‌ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మూడోసారి గెలవాలనుకున్న మంత్రికి ఎదురుగాలి సంకేతాలు కన్పిస్తున్నాయో లేక ఓటమి భయం వెంటాడుతుందో ఏమో కానీ, ఇటీవల విపక్ష నాయకులపై పోలీసులను ఉసిగొల్పుతున్నారు. బుగ్గన బుధవారం నియోజకవర్గంలోని ఎన్‌.రంగాపురానికి రాగా.. గ్రామ ఆరో వార్డు సభ్యుడు సుంకన్న వైకాపా కార్యకర్తల అరాచకాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ‘శ్మశానాన్ని కొందరు వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నారు. బడి స్థలాన్ని ఆక్రమించారు. వాగు భూమిలో మట్టి తోలడంతో సమీపంలోని కోనేరుకు నీరు రావడం లేద’ని చెప్పారు. నిజానిజాలు నిర్ధారించుకోవాల్సిన మంత్రి, ఆయన అనుచరులు వృద్ధుడన్న కనికరం లేకుండా సుంకన్నపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో బుధవారం ఉదయం 11 గంటలకు సుంకన్నను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. గురువారం సాయంత్రం వదిలారు. సుమారు 30 గంటల పాటు తమ సమక్షంలో ఉంచుకున్నప్పటికీ అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేదని సుంకన్న కన్నీటి పర్యంతమయ్యారు. ‘మంత్రిని అడగడం తప్పా? నాకు అడిగే హక్కు లేదా? సమస్యకు పరిష్కారం చూపిస్తారని చెప్పాను. అంతకుమించి నాకే ఉద్దేశమూ లేదు. నేను వార్డు సభ్యుడిని. నా వయసును చూసైనా గౌరవించకుండా చిత్రహింసలు పెడుతున్నారు’ అని వాపోయారు.

ఎన్నికల ముందర కేసుల పరంపర

  • డోన్‌ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అనుచరుడైన గుమ్మకొండకు చెందిన సర్పంచి దశరథరామిరెడ్డిపై మార్చి 26న పోలీసులు కేసు పెట్టారు. వైకాపా కార్యాలయం ముందు రెచ్చగొట్టేలా, అసభ్యంగా మాట్లాడారన్నది అభియోగం. మంగళవారం ఆయన ఓ వేడుకలో ఉండగా, పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం బెయిల్‌ ఇవ్వడంతో బయటపడ్డారు.
  • కోట్ల అభిమాని అయిన లద్దగిరికి చెందిన మిన్నెల్ల అనే వ్యక్తి 20 రోజుల కిందట ఓ వాట్సప్‌ గ్రూపులో గుత్తేదారుల కష్టాలు, తెదేపా వాళ్లపై అకారణంగా పెడుతున్న కేసుల గురించి ఓ మెసేజ్‌ పోస్ట్‌ చేశారు. ఆ వాయిస్‌ మెసేజ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. డోన్‌ ఎంపీపీ ఫిర్యాదుతో మిన్నెల్లపై 4 సెక్షన్లతో కేసు పెట్టారు. ఆయన అరెస్ట్‌కు సిద్ధంకాగా, కోట్ల కల్పించుకొని పోలీసులకు ఫోన్‌ చేసి ప్రశ్నించారు. ప్రస్తుతానికి మిన్నెల్లను అరెస్ట్‌ చేయకుండా ఆపారు.
  • బుగ్గన ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా ఆయన అనుచరులు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం సమీపానికి వచ్చినా స్పందించని పోలీసులు.. తెదేపా అభ్యర్థి సూర్యప్రకాశ్‌రెడ్డి అనుచరులను మాత్రం అర కిలోమీటర్‌ దూరంలోనే ఆపేశారు. వైకాపా కార్యకర్త ఒకరు పోలీసు స్టేషన్‌ సమీపంలోనే మద్యం తాగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తిరిగాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని