icon icon icon
icon icon icon

రాయలసీమలో వైకాపాను నేలకూల్చండి

రాయలసీమలో వైకాపాను నేలకూల్చాలని తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు.

Published : 26 Apr 2024 03:27 IST

ఓటర్లకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పిలుపు
సీమను దోచుకున్న పెద్దిరెడ్డి కుటుంబం
ఆ దోపీడీలో జగన్‌కూ వాటా ఉందని ధ్వజం
పవన్‌ను ఓడించడానికి ఎంపీ మిథున్‌రెడ్డి కుట్రలు
150 మంది ఎర్రచందనం స్మగ్లర్లతో పిఠాపురం వెళ్లారన్న కిరణ్‌కుమార్‌రెడ్డి
ఈనాడు - కడప

రాయలసీమలో వైకాపాను నేలకూల్చాలని తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజల డబ్బంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి, సోదరుడు ద్వారకనాథ్‌రెడ్డి వద్దే ఉందని వివరించారు. రాయలసీమలో రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని, సామాన్యులు ప్రశ్నిస్తే దాడులు, హత్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వేకోడూరుల్లో గురువారం నిర్వహించిన తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి బహిరంగసభల్లో చంద్రబాబు ప్రసంగిస్తూ జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే ఎంపీ మిథున్‌రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న కుటుంబం కిరణ్‌కుమార్‌రెడ్డిదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామన్నారు. పేదలకు మూడు సెంట్ల చొప్పున స్థలమిచ్చి, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. గాలేరు- నగరి కాలువను పూర్తి చేసి, కృష్జా జలాలను తీసుకొస్తామన్నారు.

ఏప్రిల్‌ నుంచే నెలకు రూ.4 వేల పింఛను

ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను ఇంటి వద్దే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 3 నెలల బకాయిలు జులైలో ఇస్తామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికే మూడు పార్టీలతో జత కట్టామని వివరించారు. పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి అని.. నన్ను అక్రమంగా జైలుకు పంపినప్పుడు ఆయన స్పందనను మీరందరూ చూశారని అన్నారు. వైకాపా తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ఎన్డీయేను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పోయిన ఎన్నికల్లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి దెబ్బ అంటూ జగన్‌ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. విశ్వసనీయత లేని జగన్‌ను చిత్తుగా ఓడించి.. ప్రజలే ఆయన గాయాలకు చికిత్స చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజంపేట తెదేపా అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం, రైల్వేకోడూరులో జనసేన నుంచి పోటీ చేస్తున్న అరవ శ్రీధర్‌లను అఖండ మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

పెద్దిరెడ్డి అరాచకాన్ని అంతం చేద్దాం: పవన్‌ కల్యాణ్‌

వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లో ఉందని, ఇది మారాలని ఆకాంక్షించారు. యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదు? పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా అని ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపదంతా దోచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, ద్వారకనాథ్‌రెడ్డిలపై ప్రజలు ఓటుతో తిరగబడాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారని, ఇసుక తోడేయడంతోనే ప్రమాద తీవ్రతతో 39 మంది చనిపోయారని ఆరోపించారు. ప్రాజెక్టు కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి పట్టించుకోలేదు.. ప్రశాంతంగా కూర్చుని మద్యం వ్యాపారం చేసుకున్నారని పవన్‌ దుయ్యబట్టారు. రాజంపేట ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దిరెడ్డి ఈ ప్రాంతం తన జాగీరు అన్నట్లు వ్యవహరిస్తున్నారని, అంగళ్లలో చంద్రబాబుపై దాడి చేయించడమే కాకుండా 5 కేసులు పెట్టించారని పవన్‌ మండిపడ్డారు. పుంగనూరులో అరాచకాలకు పాల్పడుతున్నారని, పులిచెర్లలో ప్రశ్నించిన వ్యక్తి చేతులు విరగ్గొట్టారని, మరోచోట వీరి దందాను ప్రశ్నించిన వ్యక్తి రెండు కాళ్లు నరికేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక టిప్పర్లపై తమ పేరుంటే ఎవరూ ఆపడానికి లేదని హుకుం జారీ చేశారన్నారు. పెద్దిరెడ్డి ప్రాంతానికి అమూల్‌ డెయిరీ రాదని.. శ్రీజ డెెయిరీని నాశనం చేశారని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టులో ప్రమాదాన్ని గుర్తించి ఎన్నో ప్రాణాలను కాపాడిన లష్కర్‌ రామయ్యకు జనసేన తరఫున సాయం అందజేసి గౌరవించామన్నారు. సారా వ్యాపారం చేసుకునే మిథున్‌రెడ్డి నన్ను పిఠాపురంలో ఓడిస్తారట అని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో తనను ఓడించడానికి వచ్చిన మిథున్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

పెద్దిరెడ్డి కుటుంబం మీ ఆస్తులనూ దోచేస్తారు: నల్లారి

పెద్దిరెడ్డి కుటుంబం సహజవనరుల్ని దోచుకుందని, మరోసారి అవకాశం ఇస్తే మీ ఆస్తులనూ కాజేస్తుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను హెచ్చరించారు. వారికి ఈ ఎన్నికల్లో తగిన శాస్తి చేయాలని కోరారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ను ఓడించడానికి ఎంపీ మిథున్‌రెడ్డి 150 మంది ఎర్రచందనం స్మగ్లర్లను తీసుకెళ్లినట్లు తనకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. పవన్‌ను ఓడించడం ఎవరితరం కాదన్నారు.


మాజీ సీఎంల ముచ్చట్లు

మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా బహిరంగ వేదికపై కలిశారు. సభావేదికపైకి వచ్చిన చంద్రబాబుకు కిరణ్‌కుమార్‌రెడ్డి నమస్కరించబోయారు. మనిద్దరి మధ్య నమస్కారాలేంటి అంటూ చంద్రబాబు ఆయన చేతులు పట్టుకుని వారించారు. వేదికపైనే ఇద్దరూ కాసేపు కుశల ప్రశ్నలు వేసుకుని మాట్లాడుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img