ఎవరి కోసం చేశారు ఇదంతా...?

రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది.

Updated : 26 Apr 2024 08:09 IST

ఎన్నికల తర్వాత ఊపందుకోనున్న ఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తు
ఇకమీదట నాయకుల చుట్టూ తిరిగే అవకాశం
ప్రణీత్‌రావుపై సైబర్‌ ఉగ్రవాద సెక్షన్‌ ప్రయోగం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. మొదటి దశ దర్యాప్తు పూర్తయ్యేసరికి రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. పోలీసులు ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. ఇకమీదట జరిగే దర్యాప్తు అంతా రాజకీయ నాయకుల చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి ఈ దర్యాప్తునకు కొంత విరామం ఇచ్చి, ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరిగి మొదలుపెట్టాలన్నది అధికారుల ఆలోచన. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్‌ చేశారన్నది ప్రధాన అభియోగం కాగా ఎవరి కోసం చేశారన్నది తేల్చకపోతే కేసు నిలబడే అవకాశం లేదు. అందుకే ఇప్పటి వరకూ క్షేత్రస్థాయిలో ఆధారాల సేకరణపై దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులు ఇక మీదట పైస్థాయిలో జరిగిన తతంగాన్ని నిగ్గు తేల్చనున్నారు. ఎస్సైబీ(స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌) కేంద్రంగా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. గత శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాడే డీఎస్పీ ప్రణీత్‌రావు కార్యాలయంలోని హార్డ్‌డిస్కులు ధ్వంసం చేసినట్లు గుర్తించిన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రణీత్‌రావు.. ప్రతిపక్షపార్టీలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు, ఈ బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే ఆధారాలు ధ్వసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడయింది. ఇవే అభియోగాలపై ఇప్పటి వరకూ నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎస్సైబీకి నేతృత్వం వహించిన ప్రభాకర్‌రావు.. ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా చేశారు. అమెరికా వెళ్లిపోయారు. ఆయన ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని దర్యాప్తులో వెల్లడయింది.

గూడచార సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడంతో ఇజ్రాయెల్‌ది ప్రపంచంలోనే అగ్రస్థానం. తయారీ సంస్థలు ఆయా దేశాల పోలీసు, భద్రతా బలగాలను తమ దేశానికి ఆహ్వానిస్తుంటాయి సాధారణంగా ఇలాంటి పర్యటనలకు ఎస్పీ (టెక్నికల్‌), ఆ పైస్థాయి అధికారులు వెళుతుంటారు. కాని డీఎస్పీ అయిన ప్రణీత్‌రావును పంపారు.

ఆధారాల ధ్వంసంసై ఐటీ చట్టం

ఫోన్‌ట్యాపింగ్‌ ఆధారాలు దొరక్కుండా చేసేందుకు ప్రణీత్‌రావు ఎస్సైబీలోని అనేక హార్డ్‌డిస్కులు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ధ్వంసం చేశారు. వాటిలో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సైబీ సేకరించి పెట్టిన వామపక్ష తీవ్రవాదం తాలూకూ సమాచారం కూడా ఉంది. ఇలా ధ్వంసం చేయడం దేశ భద్రతకే ముప్పులాంటిదని అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ సమాచారం ధ్వంసానికి సంబంధించి ప్రణీత్‌రావు తదితరులపై ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఎఫ్‌, 66బి, 65 ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి సైబర్‌ ఉగ్రవాదానికి పాల్పడేవారిపై 66ఎఫ్‌ ప్రయోగిస్తుంటారు. ప్రణీత్‌రావుపై మోపిన అభియోగాల్లోని కొన్ని అంశాలు సెక్షన్‌ 66ఎఫ్‌కు వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని