కరోనా విలయం: 40 లక్షల మంది బలి!

తాజాగా అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 40లక్షలు దాటింది.

Updated : 18 Jun 2021 17:22 IST

166 రోజుల్లోనే 20లక్షల మంది మృత్యువాత

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సృష్టించిన విలయానికి యావత్ ప్రపంచం వణికిపోయింది. వైరస్‌ బయటపడిన ఏడాదిన్నర కాలంలోనే లక్షల మందిని బలి తీసుకుంది. తాజాగా అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 40లక్షలు దాటింది. కరోనా వెలుగు చూసిన తొలి ఏడాదిలోనే 20లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 లక్షల మరణాలు కేవలం ఐదున్నర నెలల్లోనే చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాతో చనిపోతున్న ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయుడు ఉంటున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

సగం మరణాలు ఐదు దేశాల్లోనే..

కొన్ని దేశాల్లో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ.. కొవిడ్‌ మరణాలు మాత్రం ఆగడం లేదు. రాయిటర్స్‌ వార్తాసంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 40 లక్షల మార్కుని దాటింది. వీటిలో సగం మరణాలు కేవలం ఐదు దేశాల్లో (అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, రష్యా, మెక్సికో)నే చోటుచేసుకున్నాయి. కరోనా వెలుగు చూసిన తొలి ఏడాదిలో 20 లక్షల మరణాలు సంభవించగా.. మరో 20లక్షల మరణాలకు 166 రోజులే పట్టింది. ఇక పెరూ, హంగేరీ, బోస్నియా, చెక్‌ రిపబ్లిక్‌, గిబ్రాల్టర్‌ దేశాల్లో కొవిడ్‌ మరణాల రేటు అత్యధికంగా ఉంది.

వణికిపోయిన లాటిన్‌ అమెరికా..

లాటిన్‌ అమెరికా దేశాలను వైరస్‌ తీవ్రంగా వణికించింది. ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా, కొలంబియా, బ్రెజిల్‌, పెరూ దేశాల్లోనూ కొవిడ్‌ మరణాల రేటు అధికంగా ఉంది. బొలీవియా, చిలీ, ఉరుగ్వే దేశాల్లో యువకులపైనే వైరస్‌ ప్రభావం అధికంగా చూపించింది. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారే ఎక్కువ మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో ఐసీయూ పడకల్లో 80శాతం కొవిడ్‌ రోగులతోనే నిండిపోయాయి.

మరణాల సంఖ్య మరింత ఎక్కువే..?

కొవిడ్‌ మరణాలపై ప్రపంచదేశాలు నమోదు చేస్తున్న వివరాలతో పోలిస్తే వాస్తవ మరణాల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండనున్నట్లు వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గత నెలలో అంచనా వేసింది. ఇక భారత్‌లోనూ పలు రాష్ట్రాలు కొవిడ్‌ మరణాల సంఖ్యను సవరిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ఒక్క బిహార్‌లోనే దాదాపు 4వేల మరణాలు అధికంగా చోటుచేసుకున్నాయని సవరించిన జాబితాను ఆ రాష్ట్రం విడుదల చేసింది. మహారాష్ట్రలోనూ నమోదైన మరణాల సంఖ్య కంటే దాదాపు 2వేల మరణాలు అధికంగా ఉన్నాయని తెలిపింది. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం, కొవిడ్‌ మరణాలు అధికంగా చోటుచేసుకున్న దేశాలు..

దేశం       మరణాల సంఖ్య

అమెరికా     600934
బ్రెజిల్‌       4,96,004
భారత్‌       3,83,490
మెక్సికో      2,30,792
పెరూ        1,89,757


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని