చైనా సైనికులకు ఎదురొడ్డి నిల్చిన గొర్రెల కాపరులు: వాస్తవాధీన రేఖ వద్ద అరుదైన ఘటన

వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల(Chinese soldiers) నుంచి వచ్చిన అభ్యంతరాన్ని లెక్కచేయకుండా మన గొర్రెల కాపరులు ధైర్యాన్ని ప్రదర్శించారు. 

Updated : 31 Jan 2024 13:54 IST

శ్రీనగర్‌: వాస్తవాధీన రేఖ వద్ద మన గొర్రెల కాపరులు(Ladakh Shepherds) చైనా సైన్యానికి(Chinese soldiers) ఎదురొడ్డి నిలబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సరిహద్దు ప్రాంతంలో భారత భూభాగం వైపు జీవాలను మేపొద్దంటూ పీఎల్‌ఏ దళాలు(PLA troops) అభ్యంతరాలు తెలిపినా.. వారు లెక్కచేయలేదు. మన సైన్యం సాయంతో అక్కడి నుంచి చైనా సేనలను వెనక్కి పంపించారు. లద్దాఖ్‌లోని కాక్‌జంగ్‌ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను చుషుల్‌ కౌన్సిలర్ కొంచోక్‌ స్టాంజిన్‌ షేర్ చేశారు.

కొద్దిరోజుల క్రితం కాపరులు, చైనా సైన్యానికి మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియోను కూడా కొంచోక్‌ షేర్ చేశారు. గొర్రెల కాపరులు ఆ ప్రాంతాన్ని వీడాలని చైనా సైనికులు హారన్‌ కొట్టి సంకేతాలు ఇచ్చారు. తాము భారత భూభాగం వైపే మేపుతున్నామని మనవాళ్లు స్పష్టంగా చెప్పేశారు. వారి మధ్య గొడవ ముదిరినప్పుడు కాపరులు రాళ్లు తీయడం ఆ వీడియోలో కనిపించింది. అయితే.. రెండు వర్గాల మధ్య ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు.

2020 ఏప్రిల్‌లో గల్వాన్‌ వద్ద భారత్‌-చైనా సైన్యాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు మరణించారు. 1967 తర్వాత భారత్‌-చైనా మధ్య జరిగిన అతిపెద్ద ఘర్షణ ఇదే. అప్పటినుంచి వాస్తవాధీన రేఖ(LAC) సమీపంలో సంచార జాతులు గొర్రెలను మేపడం మానేశాయి.  మూడేళ్ల తర్వాత మొదటిసారి భారత సైన్యం సహాయంతో కాపరులు.. పీఎల్‌ఏ దళాల(PLA troops)కు తమ హక్కును స్పష్టంగా తెలియజేశారు. సరిహద్దు ప్రాంత ప్రజల ప్రయోజనాలు రక్షించేందుకు కృషి చేస్తున్న మన బలగాలకు కొంచోక్‌ కృతజ్ఞతలు చెప్పారు.

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని