Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 27 Apr 2024 21:01 IST

1. రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. కాపాడుకోవాలి: చంద్రబాబు

కూటమి ప్రభుత్వం రాగానే అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌ నవరత్నాలు.. నవమోసాలు అయ్యాయని దుయ్యబట్టారు. గులకరాయితో హత్యాయత్నం చేశానని నాపై నింద వేశారనీ, కోడి కత్తి కేసులోనూ ఇలాంటి ఆరోపణలే చేశారని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌ను గద్దె దించే వరకు యువత పోరాడాలి: పవన్‌ కల్యాణ్‌ 

రాష్ట్రంలో 30వేల మంది మహిళలు అదృశ్యమైనా సీఎం జగన్‌ ఒక్క సారి కూడా స్పందించలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా గంజాయి దొరుకుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి విక్రయించే వాళ్లను ఉక్కుపాదంతో అణచివేస్తాం’’ అని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడడం ఇదే తొలిసారి: ప్రియాంక గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ ‘సంపద పంపిణీ’ హామీపై ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ (priyanka gandhi) తిప్పికొట్టారు. తన జీవితంలో చాలామంది ప్రధానులను చూశానని, కానీ ఇంత పచ్చి అబద్ధాలను చెప్పే ప్రధానిని చూడడం ఇదే తొలిసారి అన్నారు. ఇటీవల పలు ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలు కూడా తీసేసుకుంటుందంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక స్పందించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ముగిసిన పరిశీలన.. గుంటూరు లోక్‌సభకు అత్యధిక నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల్లో శుక్రవారం పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు రిటర్నింగ్‌ అధికారులు రెండ్రోజుల సమయం తీసుకున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్‌ అధికారులు ఆమోదం తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్‌ అజెండా: రేవంత్‌రెడ్డి

అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్‌ పార్టీ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలు 50శాతానికి పైగా ఉన్నారని, జనగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. లోన్‌ యాప్‌ వేధింపులకు బీటెక్‌ విద్యార్థి బలి

లోన్‌ యాప్‌లో అప్పుతీసుకొని.. తిరిగి చెల్లించలేక, వారి వేధింపులు తట్టుకోలేక వినీత్‌ అనే బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా  సదాశివపేటలో చోటు చేసుకుంది. రూ.25 లక్షలు అప్పుతీసుకున్న వినీత్‌.. క్రికెట్‌ బెట్టింగ్‌లో నష్టపోయాడు. అప్పు చెల్లించాలని యాప్‌ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ తేదీలు వచ్చేశాయ్‌.. ఈ ఫోన్లపై డిస్కౌంట్‌

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) మరో బిగ్‌ సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ (Great Summer Sale) తేదీని తాజాగా ప్రకటించింది.  మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుంది. మరో ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) కూడా బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ తేదీలను వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్

తమ మేనిఫెస్టో గురించి వివరించేందుకు ప్రధాని మోదీతో భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇటీవల సమయం అడిగిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలకు ఖర్గే ఘాటుగా బదులిచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే..? మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్

త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు, తన వ్యక్తిగత జీవితం గురించి అమెరికా (USA) అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) పలు విషయాలను పంచుకున్నారు. అలాగే ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆ పరిస్థితికి గల కారణాన్ని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

10. జగన్‌ ప్రకటించింది మేనిఫెస్టో కాదు.. రాజీనామా పత్రం చంద్రబాబు 

కలెక్టరేట్లు, రైతు బజార్లు తాకట్టు పెట్టి జగన్‌ అప్పులు తెచ్చాడని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి భవిష్యత్‌తో ఆడుకున్నారు. మేం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులకు జీతాలు పెంచుతాం. ప్రభుత్వ ఉద్యోగులను జగన్‌ బానిసలుగా చూస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని