70వేల మార్కు దిశగా కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. తాజాగా 9,13,319 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 68,020 కొత్త కేసులు వెలుగుచూశాయి.

Updated : 29 Mar 2021 10:34 IST

ఒక్క మహారాష్ట్రలోనే 40,414 మందికి కొవిడ్

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. తాజాగా 9,13,319 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 68,020 కొత్త కేసులు వెలుగుచూశాయి. 291 మంది ప్రాణాలు వదిలారు. మొత్తంగా కరోనా సోకిన వారి సంఖ్య కోటీ 20లక్షల మార్కును దాటింది. నిన్నటివరకు 1,61,843 మంది ప్రాణాలు కోల్పోయారని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో గతేడాది అక్టోబర్ నాటి విజృంభణ కనిపిస్తోంది.

ఇక, పాజిటివ్ కేసుల్లో పెరుగుదల మూలంగా కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటేసింది. ఆ రేటు నాలుగు శాతం దాటింది. మరోవైపు, నిన్న 32,231 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మీద కోటి 13లక్షల పైచిలుకు మంది వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 94.59 శాతానికి పడిపోయింది. ఇక, కరోనా వైరస్ టీకాల విషయానికొస్తే..మార్చి 28న కేవలం 2,60,653 మందికి మాత్రమే టీకా డోసులు అందాయి. ఇప్పటివరకు టీకా వేయించుకున్నవారి సంఖ్య 6,05,30,435కి చేరింది.

ఒక్క మహారాష్ట్రలోనే 40వేల కేసులు..

మహారాష్ట్రను కరోనా పీడిస్తోంది. మరోసారి లాక్‌డౌన్‌ తప్పని పరిస్థితులు కల్పిస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో 40,414 మందికి కరోనా సోకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  నిన్న కొవిడ్‌తో 108 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దేశంలో మొత్తం కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్ర వాటానే అధికంగా ఉంది. కొత్త కేసుల్లో మూడింట రెండొంతులు ఇక్కడే బయటపడ్డాయి. అలాగే ఆ ఒక్క రాష్ట్రంలోనే 3,27,241 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇప్పటివరకు 27,13,875 మందికి వైరస్ సోకగా..23,32,453 మంది దాన్నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తోన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే..లాక్‌డౌన్‌ను ఎలా విధించాలో కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని