Azad: ‘విధేయుడి నుంచి తిరుగుబాటు వరకు’.. కాంగ్రెస్‌ పార్టీలో ఆజాద్‌ ప్రస్థానం ఇలా..!

శతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన గులాం నబీ ఆజాద్‌ రాజకీయ ప్రస్థానం దాదాపు ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది.

Published : 27 Aug 2022 01:52 IST

దిల్లీ: సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో (Congress) ఐదు దశాబ్దాలపాటు కొనసాగిన అగ్రనేత.. ఎమర్జెన్సీతోపాటు ఎన్నో సందర్భాల్లో పార్టీని సంక్షోభాల నుంచి గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు.. రాష్ట్రాల్లో పార్టీ చిక్కుల్లో పడినప్పుడల్లా అధిష్ఠానం తరఫున దూతగా వెళ్లి పరిష్కరించిన రాజకీయ చతురుడు.. సంప్రదింపులు, చర్చలతోపాటు పార్టీ నిలదొక్కుకోవడంలో కీలకంగా వ్యవహరించిన నేర్పరి.. 

ఇలా దశాబ్దాలపాటు గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad).. చివరకు ఆ పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ రెబల్‌గా మారిపోయారు! ఇందుకు పలు కారణాలు పేర్కొన్న ఆయన.. చివరకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. శతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన ఆజాద్‌ రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో ఓసారి చూద్దాం.

1941లో జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లా, భదర్వాలోని సోటి గ్రామంలో ఆజాద్‌ (Ghulam Nabi Azad) జన్మించారు. బూత్‌ లెవల్‌ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

1973 నుంచి 1975వరకు బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన ఆయన.. 1975-76 వచ్చేసరికి జమ్మూకశ్మీర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి చేరుకున్నారు.

సంజయ్‌ గాంధీ నేతృత్వంలోని ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌లో (IYC) 1977 నుంచి పనిచేసి.. పలుమార్లు జైలుకు వెళ్లారు. ఈ క్రమంలో 1978-79లో సుమారు 40రోజుల పాటు తిహాడ్‌ జైల్లో ఉన్నారు.

సంజయ్‌ గాంధీ మరణం తర్వాత ఐవైసీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాజీవ్‌ గాంధీ మద్దతుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

1980 పార్లమెంట్‌ ఎన్నికల్లో మహారాష్ట్రలోని వాసిం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన ఆజాద్‌ (Ghulam Nabi Azad).. 1982లో ఇందిరా గాంధీ నేతృత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మాజీ ప్రధానులు రాజీవ్‌ గాంధీ, వీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ హయాంలలో పనిచేసిన ఆయన 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌ పార్టీలో అన్ని కీలక స్థానాల్లో కొనసాగిన ఆజాద్‌.. రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

2006 నుంచి 2008 మధ్య కాలంలో జమ్మూకశ్మీర్‌ శాసనసభ సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. 2006లో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి పదవినీ గులాం నబీ ఆజాద్‌ చేపట్టారు.

1982 నుంచి కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ప్రతిసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మహాత్మాగాంధీ, జవహార్‌లాల్‌ నెహ్రూ, సర్ధార్‌ పటేల్‌, మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి స్వాతంత్ర్య సమరయోధుల సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందినట్లు చెప్పిన ఆజాద్‌.. సంజయ్‌ గాంధీ ప్రోత్సాహం వల్లే కాంగ్రెస్‌లో చేరానని చెబుతుంటారు.

ఇలా సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్‌ దిగ్గజ నేతల్లో ఒకరిగా పేరొందిన ఆజాద్‌ (Ghulam Nabi Azad).. చివరకు 2020లో గాంధీ కుటుంబంపై తిరుగుబాటు చేశారు. పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ 23 మంది (జీ-23) సీనియర్‌ నేతలు అధిష్ఠానికి వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపించారు.

ముఖ్యంగా రాహుల్‌ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పజెప్పినప్పటి నుంచి పరిస్థితులు మరింత దిగజారాయని పేర్కొంటూ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని