Simultaneous polls: ‘హంగ్‌ వస్తే.. మళ్లీ ఎన్నికలు’.. కోవింద్‌ కమిటీ నివేదికలో కీలకాంశాలు

లోక్‌సభతో పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసింది.

Updated : 14 Mar 2024 18:06 IST

దిల్లీ: దేశంలో ఏకకాల ఎన్నికలకు (One Nation, One Election) సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఇందులో ముఖ్యమైన అంశం ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించడం. లోక్‌సభతో పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఒకవేళ హంగ్‌ పార్లమెంట్‌/అసెంబ్లీ లేదా అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు చోటుచేసుకున్నట్లయితే కొత్త సభను ఏర్పాటుచేయడం కోసం.. ఐదేళ్లలో మిగిలిన కాలానికి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది.

ఏకకాల ఎన్నికల పునరుద్ధరణ: స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో నిర్వహించిన ఏకకాల ఎన్నికలను (Simultaneous polls) పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కోవింద్‌ కమిటీ ప్రధానంగా ప్రస్తావించింది. ఏటా పలుమార్లు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం, వ్యాపారాలు, కార్మికులు, కోర్టులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పౌర సమాజంతోపాటు వివిధ భాగస్వామ్య పక్షాలపై గణనీయమైన భారం పడుతోందని తెలిపింది. ఏకకాల ఎన్నికల వల్ల అభివృద్ధితోపాటు సామాజిక ఐక్యతకు దోహదం చేస్తాయని పేర్కొంది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంతోపాటు భారత పౌరుల ఆకాంక్షలను సాకారం చేయడంలో సాయపడతాయని అభిప్రాయపడింది. 

రెండు దశల్లో : జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు రెండంచెల విధానాన్ని కోవింద్‌ కమిటీ సిఫార్సు చేసింది. తొలుత లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. రెండో దశలో.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది.

హంగ్‌ వస్తే : ఒకవేళ హంగ్‌ పార్లమెంట్‌ లేదా అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులే వస్తే.. మిగిలిన సభా కాలానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఐదేళ్లలో మిగిలిన కాలపరిమితికి మాత్రమే అవి వర్తిస్తాయి. అసెంబ్లీల విషయానికొస్తే.. కొత్తగా ఏర్పడిన లోక్‌సభ పదవీకాలం ముగిసేవరకు (ముందస్తుగా రద్దైతే తప్ప) కొనసాగుతాయి.

రాజ్యాంగ సవరణ: అమల్లోకి తేవాలంటే ఆర్టికల్‌ 83 (పార్లమెంటు కాలవ్యవధి), ఆర్టికల్‌ 172 (రాష్ట్రాల అసెంబ్లీల గడువుకు సంబంధించిన) రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుకోసం రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. మున్సిపాలిటీ, పంచాయతీలకు ఏకకాల ఎన్నికల కోసం ఆర్టికల్‌ 324ఏ, ఓటర్ల జాబితా, గుర్తింపుకార్డుల కోసం ఆర్టికల్‌ 325ను సవరించాలి. ఇందుకు రాష్ట్రాల ఆమోదం అవసరం.

ప్రణాళిక అవసరం: మొత్తంగా ఏకకాల ఎన్నికలను నిర్వహించేందుకు చట్టబద్ధత కలిగిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. ఈ సమయంలో ఏకకాల ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, పోలింగ్‌, భద్రతా సిబ్బంది వంటి ఏర్పాట్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ప్రణాళికలను రూపొందించుకోవాలని కోవింద్‌ కమిటీ నివేదిక సిఫార్సు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని