Sandeshkhali: సుప్రీం దృష్టికి ‘సందేశ్‌ఖాలీ’.. పిల్‌పై విచారణ అంశం పరిశీలనకు..!

సందేశ్‌ఖాలీలో మహిళలను లైంగికంగా వేధించిన అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు ఎదుటకు వచ్చింది. దీని విచారణ అంశాన్ని పరిశీలిస్తానని సీజేఐ వెల్లడించారు.

Updated : 16 Feb 2024 15:22 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాలోని సందేశ్‌ఖాలీలో మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులు, భూఆక్రమణలకు పాల్పడ్డారన్న అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికొచ్చింది. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించే అంశాన్ని పరిశీలిస్తామని చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఈ అంశంపై సీబీఐ లేదా సిట్‌తో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ గురువారం పిల్‌ దాఖలైంది. అత్యవసరంగా విచారణను చేపట్టాలని కోరుతూ శుక్రవారం సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎదుటకు వచ్చింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ‘‘మీరు నాకు ఈమెయిల్‌ పంపారా (అత్యవసర విచారణ కోరుతూ)’’ అని పిటిషన్‌దారు అలోక్‌ శ్రీవాస్తవాను అడిగారు. అతడి నుంచి సానుకూల సమాధానం రావడంతో ఈ కేసును మధ్యాహ్నం చూస్తానని చెప్పారు. 

సందేశ్‌ఖాలీ బాధితులకు పరిహారం ఇప్పించడంతోపాటు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ శ్రీవాస్తవా కోరారు. ఈ కేసు దర్యాప్తు, విచారణను పశ్చిమబెంగాల్‌ పరిధి నుంచి తప్పించాలన్నారు. మణిపుర్‌ హింసాకాండపై దర్యాప్తు చేపట్టినట్లుగానే.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని అభ్యర్థించారు. 

ఎన్నికల ముందు స్తంభించిన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు.. మాకెన్‌ తీవ్ర ఆరోపణలు

కొన్నాళ్లుగా సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల అంశం పశ్చిమబెంగాల్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు ఇక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఫిర్యాదులు చేయగా పోలీసు యంత్రాంగం కూడా టీఎంసీ నేతకే అనుకూలంగా వ్యవహరించినట్లు బాధితులు వాపోతున్నారు. ఈడీ అధికారులపై దాడి కేసులో నిందితుడైన షేక్‌ షాజహాన్‌ ఇప్పటికే పరారీలో ఉన్నాడు. దీంతో అతడిని అరెస్టు చేయాలని మహిళలు ఆందోళనకు దిగారు. ఈ అంశాన్ని కోల్‌కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలు తమను వేదనకు గురిచేశాయని జస్టిస్‌ అపుర్బ సిన్హారాయ్‌ తెలిపారు. ఈమేరకు ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని