Farmers Protest: రైతులపై మరోసారి టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

Farmers Protest: దిల్లీ శివారులో రైతుల నిరసన రెండోరోజుకి చేరుకుంది. నగరంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న వారిపై పోలీసులు మరోసారి బాష్పవాయువు ప్రయోగించారు.

Updated : 14 Feb 2024 11:56 IST

దిల్లీ: దిల్లీ చలో నిరసన కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని శివారులో ఉన్న రైతులపై (Farmers Protest) మరోసారి బాష్పవాయువు ప్రయోగం జరిగింది. రెండోరోజు శంభు సరిహద్దులో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు రైతులు తెలిపారు. హరియాణా పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని పేర్కొన్నారు.

రైతుల నిరసనల నేపథ్యంలో దిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హరియాణా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్‌ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రైతులను అడ్డుకునేందుకు  కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బ్యారికేడ్లను పెట్టారు. రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచాయి.

దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..

మరోవైపు నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్‌ భూభాగంలోకి రావడంపై ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పటియాలా డిప్యూటీ కమిషనర్ (DC) షౌకత్‌ అహ్మద్‌.. అంబాలా డీసీకి లేఖ రాశారు. శంభు సరిహద్దుల్లో డ్రోన్లు తమ భూభాగంలోకి రావొద్దని తేల్చి చెప్పారు. ప్రస్తుతానికైతే డ్రోన్ల కదలికలు ఆగిపోయాయని అహ్మద్‌ బుధవారం వెల్లడించారు.

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు (Farmers Protest) చేపట్టిన ‘దిల్లీ చలో’ మంగళవారం రణరంగమైన విషయం తెలిసిందే. రైతులు. పోలీసుల మధ్య పలు చోట్ల తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బారికేడ్లను ధ్వంసం చేసుకుని నగరంలోకి ప్రవేశించేందుకు యత్నించిన నిరసనకారులపై పోలీసులు డ్రోన్‌ సాయంతో బాష్ప వాయువును ప్రయోగించారు. ఇలా టియర్‌ గ్యాస్‌ కోసం డ్రోన్లను వాడడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని