Farmers Protest: దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..

దిల్లీ సరిహద్దుల్లో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. బుధవారం కూడా దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని రైతులు ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Updated : 14 Feb 2024 11:22 IST

దిల్లీ: దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’  (Farmers Protest) నిరసన కార్యక్రమానికి మంగళవారం అర్ధరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై కందకాలు తవ్వారు. దిల్లీలో 144 సెక్షన్‌ అమలు, రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

మంగళవారం దిల్లీ సరిహద్దుకు చేరుకున్న రైతులు రాత్రంతా రోడ్లపైనే గడిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి కోసం బుధవారం ఉదయం టీ, అల్పాహారాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా.. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు తెలిపారు. అయితే, రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని, వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించొద్దని వారికి విజ్ఞప్తి చేశారు. మరోసారి చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత స్వామినాథన్‌ కుమార్తె మధుర రైతుల ఆందోళనలపై స్పందించారు. ‘‘తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘దిల్లీ చలో’ చేపట్టిన రైతులను అరెస్టు చేసి జైళ్లకు తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. వాళ్లేం నేరస్థులు కాదు, అన్నదాతలు. వారితో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని తెలిపారు.

రైతులకు కాంగ్రెస్ సంఘీభావం

రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’ కార్యక్రమానికి కాంగ్రెస్‌ (Congress) పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. బుధవారం ఆయన దిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులను కలుస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పంటలకు కనీస మద్దతు ధర (MSP)కు చట్ట బద్ధత కల్పిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని